
అర్ధరాత్రి ఒడ్డుకు చేరిన మత్స్యకారులు
వంగర: మండల పరిధి మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టులో చేపలవేటకు వెళ్లి గుర్రపుడెక్కలో చిక్కుకున్న తండ్రీ కొడుకులు దాసరి రాములు, ఆదినారాయణ బుధవారం అర్ధరాత్రి దాటిన తరువాత సురక్షితంగా ఒడ్డుకు చేరారు. గుర్రపుడెక్క తిప్పు కోవడంతో సుమారు 10 గంటల పాటు ప్రాజెక్టులోనే రక్షించాలంటూ ఆర్తనాదాలు చేశారు. వంగర పోలీసులు రంగప్రవేశం చేయడంతో సహచర మత్స్యకారులు పడవల్లో ప్రాజెక్టు లోపలికి వెళ్లి గాలింపు చేపట్టారు. చివరకు బుధవారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో అతికష్టంమీద తండ్రీకొడుకులను ఒడ్డుకు చేర్చారు. దీంతో వారి కుటుంబ సభ్యులు, మత్య్సకారులు, అధికార యంత్రాంగం అంతా ఊపిరి పీల్చుకున్నారు.