
మత్స్యకారుల హాహాకారాలు
వంగర: మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టులో చేపలవేటకు వెళ్లిన ఇద్దరు మత్స్యకారులు గుర్రపుడెక్క మధ్యలో బుధవారం చిక్కుకున్నారు. వారిని బయటకు తెచ్చేందుకు పోలీసులు, మత్స్యకారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మెట్టమగ్గూరు గ్రామానికి చెందిన తండ్రీ కొడుకులు దాసరి రాములు, దాసరి ఆదినారాయణ బుధవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో చేపలు వేటకు వెళ్లారు. ప్రాజెక్టులో దట్టంగా ఉన్న గుర్రపుడెక్క వీరిని చుట్టుముట్టడంతో పడవ ముందుకు సాగని పరిస్థితి. తండ్రీ కొడుకులు అందులో చిక్కుకోవడంతో తమను రక్షించాలంటూ ప్రాజెక్టు లోపలి భాగం నుంచి కేకలు వేస్తూ ఆర్తనాదాలు చేశారు. విషయం తెలుసుకున్న వంగర పోలీసులు హుటాహుటిన ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు. ఎగువ ప్రాంతాల్లో ఉన్న పట్టువర్థనం గ్రామం నుంచి కొంతమంది మత్స్యకారులు, మగ్గూరు గ్రామం నుంచి కొంతమంది మత్స్యకారులను ఆరు పడవలతో ప్రాజెక్టు లోపలకు పంపించారు. కటిక చీకటి కావడంతో గుర్రపుడెక్కను తొలగించుకుంటూ వారి వద్దకు వెళ్లేందుకు చేసిన ప్రయత్నంలో అష్టకష్టాలు పడ్డారు. బాధితుల కేకలు వినిపిస్తున్నప్పటికీ దట్టంగా అల్లుకున్న గుర్రుపుడెక్క కారణంగా వారి వద్దకు చేరుకునే పరిస్థితి కానరావడం లేదు. రాత్రి వరకు శ్రమించినప్పటికీ కటిక చీకటి కావడంతో పాజెక్టులో చిక్కుకున్నవారిని చేరుకునేందుకు తోటి మత్స్యకారులకు వీలు పడలేదు. అర్ధరాత్రి అయ్యేసరికి వారిని బయటకు తీసుకువస్తామంటూ బాధిత కుటుంబీకులకు పోలీసులు భరోసా ఇస్తున్నారు. మత్స్యకారులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించి క్షేమంగా ఒడ్డుకు చేరుకోవాలని రాములు కుటుంబ సభ్యులు గంగమ్మతల్లిని ప్రార్థిస్తున్నారు.
మడ్డువలస ప్రాజెక్టులో చేపలవేటకు వెళ్లి గుర్రపుడెక్కలో చిక్కుకున్న
మత్స్యకారులు
కాపాడేందుకు రంగంలోకి దిగిన పోలీసులు, మత్స్యకారులు
ప్రాజెక్టులో గాలింపు చర్యలు

మత్స్యకారుల హాహాకారాలు