
కేజీబీవీలో అగ్నిప్రమాదంపై ఫైర్ ఆడిట్
● విద్యార్థులు ఆందోళన చెందొద్దు
● సోమవారానికి పూర్తిస్థాయిలో తరగతుల ప్రారంభం
● కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్
● కేజీబీవీని సందర్శించి దుర్ఘటనపై ఆరా
కొత్తవలస: మండలంలోని అడ్డూరువానిపాలెం గ్రామం సమీపంలో గల కస్తూర్బా గాంధీ పాఠశాలలో మంగళవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంపై వెంటనే ఫైర్ ఆడిట్ నిర్వహించి, సాయంత్రం లోగా నివేదికను అందజేయాలని కలెక్టర్ డాక్డర్ బీఆర్ అంబేడ్కర్ విద్యుత్, సమగ్రశిక్ష ఇంజినీర్ అదికారులు, జిల్లా ఫైర్ అధికారులను ఆదేశించారు. కేజీబీవీలోని తరగతి గదుల్లో మంగళవారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పాఠశాలను కలెక్టర్ బుధవారం సందర్శించారు. కాలిపోయిన తరగతి గదులను, సామగ్రి, చుట్టుపక్కల పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులతో మాట్లాడి జరిగిన ఘటనపై ఆరా తీశారు. ఉన్న విద్యార్థులకే వసతి సౌకర్యం లేక, తరగతి గదుల్లోనే భోజనం, పడుకోవడం వంటివి చేస్తున్నట్లు గుర్తించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంటర్ తరగతులకు అనుమతులు ఎలా ఇచ్చారని జిల్లా విద్యాశాఖ అధికారి మాణిక్యం నాయుడిని ప్రశ్నించారు. జిల్లాలోని అన్ని కేజీబీవీలకు ప్లస్ టూ అనుమతులు ఇచ్చామని ఆయన బదులిఇచ్చారు. దీంతో కలెక్టర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
యథావిధిగా మెగా పేరెంట్స్, టీచర్ సమావేశం
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ సిబ్బంది అప్రమత్తంగా ఉండి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పాఠశాలనుంచి వెళ్లిపోయిన విద్యార్థులను వెంటనే రప్పించి తరగతులను యథావిధిగా ప్రారంభించాలని స్పష్టం చేశారు. విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పాఠశాలలో పరిస్థితులన్నీ బాగానే ఉన్నాయని విద్యార్థులందరూ పాఠశాలకు తిరిగి రావాలని కోరారు. గురువారం జరిగే మెగా పేరెంట్, టీచర్స్ సమావేశాన్ని యథావిధిగా నిర్వహిస్తామని ప్రకటించారు.సోమవారం నాటికి పూర్తిస్థాయిలో విద్యార్థులను పాఠశాలకు రప్పించాలని అధికారులను ఆదేశించారు. పాఠశాలలోని ప్రస్తుతం పనులను సమగ్రశిక్ష ఏపీసీ డాక్టర్ రామారావు దగ్గరుండి నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో ఆర్‌డీఓ డి.కీర్తి, విద్యుత్‌శాఖ ఎస్‌ఈ లక్ష్మణరావు, డీఎంహెచ్‌ఓ జీవనరాణి, జిల్లా ఫైర్ అధికారి రామ్‌కుమార్, ఎస్‌ఎస్‌ఏ ఈఈ హరిప్రసాద్, ఎలక్ట్రికల్ ఇన్‌స్పెక్టర్ స్వప్ప, తహసీల్దార్ అప్పలరాజు, ఎంపీడీఓ రమణయ్య, ఎంఈఓలు శ్రీదేవి, బి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

కేజీబీవీలో అగ్నిప్రమాదంపై ఫైర్ ఆడిట్