
బైక్ ఢీకొని దివ్యాంగుడి మృతి
దత్తిరాజేరు: మండలంలోని ఎస్ బూర్జవలస పోలీస్ స్టేషన్ పరిధి కుంటినవలస రోడ్డులో ఎదురుగా వస్తున్న మూడు చక్రాల వాహనాన్ని ద్విచక్ర వాహనం ఢీకొనడంతో కుంటినవలస గ్రామానికి చెందిన దివ్యాంగుడు జక్కు సత్యం(69)తలకు తీవ్రమైన గాయాలవడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్సై రాజేష్ మంగళవారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం మెంటాడ మండలం కుంటినవలస గ్రామానికి చెందిన సత్యం దివ్యాంగుడు కావడంతో సోమవారం సాయంత్రం మూడు చక్రాల వాహనంపై మరడాం వచ్చి తిరుగు ప్రయాణంలో ఇంటికి వెళ్తుండగా కుంటినవలస నుంచి ద్విచక్ర వాహనంపై మరడాం వస్తున్న వ్యక్తి ఢీకొనడంతో ప్రమాదం జరిగి మృతి చెందినట్లు తెలిపారు.
బొలెరో ఢీకొని యువకుడు..
రామభద్రపురం: మండలంలోని ముచ్చర్లవలస కోల్డ్‌స్టోరేజ్ సమీపంలో మంగళవారం ఓ బైక్‌ను ఎదురుగా వస్తున్న బొలెరో వ్యాన్ ఢీ కొట్టడంతో బైక్‌పై ఉన్న యువకుడు మృతిచెందాడు. ఈ ఘటనపై స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పాచిపెంట గ్రామానికి చెందిన పడాల సంతోష్(24) ద్విచక్రవాహనంపై రామభద్రపురం మీదుగా దత్తిరాజేరు మండలంలోని కృష్ణాపురం తన బంధువుల ఇంటికి వెళ్తున్నాడు. సరిగ్గా ముచ్చర్లవలస కోల్డ్‌స్టోరేజ్ వద్దకు వచ్చేసరికి విజయనగరం నుంచి ఎదురుగా వస్తున్న బొలెరో వ్యాన్ ఢీ కొట్టడంతో సంతోష్ అక్కడక్కడే మృతిచెందాడు. స్థానికులు, పోలీసులు మతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాడంగి సీహెచ్‌సీకి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుమేరకు ఎస్సై వి. ప్రసాదరావు కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు. సంతోష్ విశాఖపట్నంలోని గీతం వైద్యకళాశాలలో పనిచేస్తున్నాడు.