
రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించాలి
విజయనగరం క్రైమ్: రోడ్డు ప్రమాదాల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఎస్పీ వకుల్ జిందల్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం ఆయన మాట్లాడుతూ ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోవాలని సూచించారు. తద్వారా రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాపాయం నుంచి రక్షణ పొంది, సురక్షితంగా గమ్యస్థానాలు చేరుకోవాలని హితవు పలికారు. ఏటా చాలామంది వాహనదారులు రహదారి ప్రమాదాల్లో హెల్మెట్ ధరించని కారణంతో మృతి చెందుతున్నారని ఎన్సీఆర్బీ నివేదికలో వెల్లడైందని చెప్పారు. వాహనాలు నడిపినపుడు ప్రతి వాహనదారు విధిగా నాణ్యత కలిగిన హెల్మెట్ ధరిస్తే, ప్రమాదానికి గురైనప్పటికీ స్వల్ప గాయాలతో ప్రాణాలను రక్షించుకునే అవకాశం ఉంటుందన్నారు. ప్రతి ఒక్క వాహనదారు హెల్మెట్ ధరించే విధంగా చేయాలనే సంకల్పంతో జిల్లా పోలీసుశాఖ పని చేస్తుందని చెప్పారు. ప్రజలందరికీ హెల్మెట్ ధారణ పట్ల అవగాహన కల్పించి, వారిలో చైతన్యం తీసుకొచ్చేందుకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని ఎస్పీ తెలిపారు. హెల్మెట్ ధరించని వాహనదారులపై ఎంవీ నిబంధనలు అతిక్రమించినట్లు పరిగణించి ఈచలానాలను విధించాలని పోలీసు అధికారులను ఎస్పీ ఆదేశించారు. ప్రమాదాల నివారణలో పోలీసుశాఖకు సహకరించాలని ప్రజలకు ఎస్పీ వకల్ జిందల్ విజ్ఞప్తి చేశారు.
సిబ్బందికి ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశాలు