
గిరిజన రైతు విలవిల..!
● అన్నదాత సుఖీభవ కోసం నిరీక్షణ
● ఖరీఫ్‌లో తప్పని ఆర్థిక వెతలు
సీతంపేట: ఖరీఫ్ సీజన్ ఆరంభమైంది. వ్యవసాయ పనులు ప్రారంభమయ్యాయి. పంటలు పండించడానికి పెట్టుబడులు ఎలా అని రైతులు గిరిజన ఆందోళన చెందుతున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం హయాంలో ఈపాటికే పీఎం కిసాన్‌తో పాటు రైతు భరోసా నిధులు లబ్ధిదారుల ఖాతాల్లో జమ అయ్యేవి. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. కూటమి ప్రభుత్వం ఇదిగో..అన్నదాత సుఖీభవ..అదిగో..అంటూ కాలం వెళ్లబుచ్చుతోంది తప్ప ప్రయోజనం లేకపోయిందని రైతులు పెదవి విరుస్తున్నారు. పోడు వ్యవసాయంలో పండించే పైనాపిల్, పసుపు, కొండచీపుళ్లు ఇతర అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు దరలు లేవు. ఈ పంటల ద్వారా ఆదాయాలు వస్తే కొంతమేర ఖరీఫ్ వ్యవసాయానికి పెట్టుబడులు పెట్టుకోవడానికి వీలుండేది. వాటికి కూడా సరైన మద్దతు ధరలు లేకపోవడంతో పంటలు ఎలా పండించుకోవాలో తెలియని పరిస్థితి ఉందని గిరిజన రైతులు వాపోతున్నారు. అన్ని విధాలా నష్టపోతున్న తమను ఆదుకునే దిక్కులేదని ఆందోళన చెందుతున్నారు. వాతావరణం అనుకూలించడంతో వరి, రాగులు, కంది, ఇతర కొండపోడు పంటలన్నీ వేసుకోవడానికి సరైన సమయం. తగిన పెట్టుబడి సాయం లేకపోవడంతో గిరిజన రైతులు డీలా పడుతున్నారు.
16,800 మంది రైతుల ఎదురుచూపు
సీతంపేట ఐటీడీఏ పరిధిలో 16,800 మంది కొండపోడు పట్టాలు కలిగిన రైతులు అన్నదాత సుఖీభవ పథకానికి అర్హులు. వైఎస్సార్‌సీపీ హయాంలో 25 వేల ఎకరాల్లో సాగు భూమిపై పూర్తిహక్కులు కల్పించి, సుమారు 17 వేల మందికి పట్టాలు ఇచ్చి రైతు భరోసా నిధులు రూ.13.500లు చొప్పున జమచేశారు. పీఎం కిసాన్ సాయం కింద రూ.6 వేలు, వైఎస్సార్ రైతు భరోసా కింద రూ.7,500లు కలిపి మొత్తం రూ.13,500ల మొత్తాన్ని రైతు ఖాతాల్లో జమచేశారు. ఇప్పటి ప్రభుత్వంలో ఖరీఫ్ పనులు ప్రారంభమైనప్పటికీ ఇంతవరకూ ఎటువంటి సాయం లేదు. గతేడాది కూడా ఒక్కపైసా ఇవ్వలేదని రైతులు వాపోతున్నారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండడంతో దుక్కులు దున్నడం, విత్తనాలు కొనుగోలు, నారుమడుల తయారీకి రైతులకు పెద్దమొత్తంలో నిధులు అవసరమవుతాయి. తాము అధికారంలోకి వస్తే రైతులకు ఏడాదికి రూ.20 వేలు అన్నదాత సుఖీబవ ఇస్తామని కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. ప్రభుత్వం కొలువుదీరి ఏడాదైనా ఆర్థిక సాయం ఇంతవరకు అందడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు.
గతంలో ఖరీఫ్‌లో రైతు భరోసా వచ్చేది
గతంలో ఖరీఫ్ సీజన్ వచ్చిందంటే రైతుల ఖాతాల్లో నిధులు జమ అయ్యేవి. ఏడాదిగా ఎదురు చూపులే మిగిలాయి తప్ప ఎటువంటి ప్రయోజనం లేదు. ఆ సొమ్ముతో పెట్టుబడి పెట్టి పంటలు పండించే వాళ్లం.
– ఎన్.అబ్బాస్, రైతు, కుశిమి
త్వరలో నిధుల జమ
త్వరలో అన్నదాత సుఖీభవ నిధులు అర్హులందరికీ జమ అవుతాయి. ఈ మేరకు విధివిదానాలు రూపొందాయి. ప్రభుత్వం విడుదల చేసిన నిధులను వ్యవసాయ పంటల సాగుకు వినియోగించాలి.
– ఎస్వీ గణేష్, పీఏవో, సీతంపేట ఐటీడీఏ

గిరిజన రైతు విలవిల..!