విద్యార్థుల జీవితాలతో ఆటలా..?
విజయనగరం: కూటమి ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటోందని, పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనంలో పూర్తిగా విఫలమైందని వైఎస్సార్‌సీపీ విజయనగరం జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు కరుమజ్జి సాయికుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. మూల్యాంకనాన్ని లోపభూయిష్టంగా నిర్వహించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి మాణిక్యంనాయుడుకు శుక్రవారం వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సాయికుమార్ మాట్లాడుతూ గతంలో ఎన్నడూలేనివిధంగా పదో తరగతి పరీక్షల ఫలితాల ప్రకటనలో ఇటు పాలకులు, అటు అధికారులు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా 6.14 లక్షల మంది విద్యార్థులు రాత్రీపగలూ కష్టపడి చదివి పరీక్షలు రాస్తే, జవాబు పత్రాలను సరిగ్గా దిద్దకుండా, లోపభూయిష్టమైన మార్కుల లెక్కింపుతో ఫెయిల్ చేసి విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు అంతులేని మానసిక క్షోభకు గురిచేశారన్నారు. ట్రిపుల్ ఐటీ, గురుకుల జూనియర్ కాలేజీలు సహా ఇతరత్రా విద్యాసంస్థల్లో ప్రవేశాలకు విద్యార్థులు దూరమయ్యారన్నారు. రీవాల్యుయేషన్, రీ కౌంటింగ్‌లో రాష్ట్రవ్యాప్తంగా 11వేల మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారంటే మూల్యాంకనంలో ఏ స్థాయిలో లోపాలు జరిగాయో అర్థం చేసుకోవచ్చన్నారు. కొందరు విద్యార్థులు కొన్ని సబ్జెక్టుల్లో 95 మార్కులకు పైబడి సాధించడం గమనార్హమన్నారు. ప్రభుత్వ నిర్వాకానికి విద్యార్థులు బలైపోవడానికి వీల్లేదని, తప్పులకు బాధ్యులైన విద్యాశాఖ మంత్రి లోకేశ్‌తో పాటు అందరిపైనా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా విద్యార్థి విభాగం నాయకులు ధీరుయాదవ్, బోనెల తరుణ్, తిరుపతిరావు, గణేష్, అశోక్, సాయి, మురళీ, తదితరులు పాల్గొన్నారు.
పదోతరగతి జవాబుపత్రాల
మూల్యాంకనంలో యంత్రాంగం విఫలం
బాధ్యులపై తక్షణమే చర్యలు
తీసుకోవాలి
వైఎస్సార్‌సీపీ జిల్లా విద్యార్ధి విభాగం అధ్యక్షుడు కరుమజ్జి సాయి డిమాండ్
డీఈఓకు వినతిపత్రం అందజేత


