
తలసరి ఆదాయం పెంపునకు చర్యలు
● జిల్లా ఇన్‌చార్జి మంత్రి అనిత ● సంకిలి చక్కెర కర్మాగారంపై స్పష్టత ఇవ్వండి: జెడ్పీచైర్మన్
విజయనగరం క్రైమ్: విజన్–2047లో భాగంగా జిల్లా ప్రజల తలసరి ఆదాయం పెంపునకు చర్యలు తీసుకోవాలని అధికారులను జిల్లా ఇన్‌చార్జి మంత్రి, హోమ్‌శాఖ మంత్రి వంగలపూడి అనిత కోరా రు. దీనికోసం అందుబాటులో ఉన్న సహజ వనరు లను వినియోగించుకోవాలన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన డీఆర్సీ సమావేశంలో ఆమె మాట్లాడారు. వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలన్నారు. విజయనగరం ఎమ్మెల్యే అదితి సూచనల మేరకు భూగర్భ జలాల పెంపునకు చర్యలు తీసుకోవాలన్నారు. తమ నియోజకవర్గాల్లో రోడ్ల మరమ్మతు పనులు పూర్తికాలేదంటూ రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్, నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి, బొబ్బిలి ఎమ్మెల్యే బేబినాయన మంత్రి దృష్టికి తెచ్చారు. బోర్ల మరమ్మతుల పనులు వేగంగా జరగడం లేదని ఎమ్మెల్సీ సురేష్‌బాబు తెలియజేశారు. కొత్తవలసలో చెరువు లో అక్రమ రోడ్డు నిర్మాణం, రేగ, పుణ్యగిరి, ధారపర్తి తదితర గిరిజన ప్రాంతాలకు రోడ్డు నిర్మాణం ఆగిపోయిన విషయాన్ని ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు సమావేశంలో ప్రస్తావించారు. ఉపాధి హామీ ఏపీఓ శ్రీనివాసరావుపై ఫిర్యాదులు ఎక్కువ గా వస్తున్నాయని, అతనిని సరెండ్ చేయాలని మంత్రి ఆదేశించారు.
సంకిలి చక్కెర కర్మాగారాన్ని మూసివేస్తారన్న ప్రచారం జరుగుతోందని, దీనిపై వివరణ ఇచ్చి రైతులకు భరోసా కల్పించాలని జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు కోరారు. విజయనగరంలో మూడవ పట్టణ పోలీస్‌స్టేషన్‌ను, డిగ్రీ కళాశాల నిర్మాణాన్ని ప్రారంభించాలని ఎమ్మె ల్యే అదితి కోరారు. సివిల్ సప్లయ్ డీఎంగా పనిచేసి ఇటీవలే బదిలీపై వెళ్లిన మీనాకుమారిపై విజలెన్స్ విచారణకు ఆదేశించినట్టు మంత్రి ప్రకటించారు. సమావేశంలో కలెక్టర్ అంబేడ్కర్, మంత్రి కలిశెట్టి అప్పలనాయుడు, ఎస్పీ వకుల్ జిందల్, జేసీ సేతుమాధవన్, డీఆర్వో శ్రీనివాసమూర్తి, సీపీఓ బాలాజీ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.