
ఫలితాలు ‘ఆదర్శ’ నీయం
నెల్లిమర్ల రూరల్: మండలంలోని సతివాడ ఆదర్శ పాఠశాలలో ఆరో తరగతి ప్రవేశాలకు నిర్వహించిన పరీక్షలో గ్రామీణ విద్యార్థులు సత్తా చాటారు. ఫలితాల వివరాలను పాఠశాల నోటీస్ బోర్డులో గురువారం పెట్టారు. రుషాంత్ అనే విద్యార్థి 100కు 92 మార్కులు సాధించి ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. అంబళ్ల సూర్యతేజశ్వని–89, ముడి వాసు–86, రౌతు ప్రేమ్‌సాయి–85, సత్యగాయత్రి–84, యడ్ల కృపాంజలి–82, యామిని– 81 మార్కులతో వరుసగా ఏడు ర్యాంకులు సాధించారు. పరీక్షకు హాజరైన 444 మందిలో 104 మంది విద్యార్థులు 60కు పైగా మార్కులు సాధించారు. నిబంధనల ప్రకారం విద్యార్థుల ఎంపిక ప్రక్రియ ఉంటుందని ప్రిన్సిపాల్ శైలజ తెలిపారు.
చెట్టుపై నుంచి జారిపడిన వ్యక్తి మృతి
దత్తిరాజేరు: మండలంలోని గడసాం గ్రామంలో చింత చెట్టుపై నుంచి జారిపడిన మజ్జి రామునాయుడు (35) గురువారం రాత్రి మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామ సమీపంలో ఉన్న చింతచెట్టు నుంచి కాయలు కోస్తుండగా జారి పడడంతో రామునాయుడుకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే విజయనగరం సర్వజన ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. నాలుగేళ్ల కిందట కుమారుడు చెరువులో పడి మృతిచెందగా.. ఇప్పుడు భర్త చెట్టుపై నుంచి ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందడంతో భార్య గంగ కన్నీటిపర్యంతమవుతోంది. కుమార్తె హారికకు దిక్కెవరంటూ రోదిస్తోంది. కేసు నమోదుచేసినట్టు పెదమానాపురం ఎస్‌ఐ తెలిపారు.
జాతీయ లోక్‌అదాలత్ వాయిదా
పార్వతీపురం టౌన్: జిల్లాలో ఈ నెల 10వ తేదీన నిర్వహించాల్సిన జాతీయ లోక్‌అదాలత్ జూలై 5వ తేదీకి వాయిదా పడిందని రెండవ అదనపు జిల్లా జడ్జి, మండల న్యాయసేవా సాధికారత కమిటీ అధ్యక్షుడు ఎస్.దామోదరరావు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. సివిల్, రాజీ పడదగిన క్రిమినల్ కేసులు, మో టార్ ప్రమాద పరిహార కేసులు, ఇతర వివాదా ల పరిష్కారానికి లోక్ అదాలత్ ప్రజలకు అండగా ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని ప్రతీ కక్షిదారుడు వినియోగించుకుని లబ్ధిపొందాల ని ఆయన కోరారు.
వీరఘట్టంలో కుండపోత
వీరఘట్టం/విజయనగరం: ఉమ్మడి విజయనగరం జిలాలోని పలు మండలాల్లో గురువారం రాత్రి భారీ వర్షం కురిసింది. వీరఘట్టంలో గంట కాలంపాటు కుండపోతగా వర్షం కురిసింది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షానికి జనజీవనం స్తంభించింది. వీరఘట్టం బీసీ కాలనీ వద్ద పొల్లరోడ్డులో విద్యుత్ స్తంభం నేలకొరిగింది. వండవ కూడలి వద్ద రోడ్డుకు అడ్డంగా భారీ వృక్షం నేలకొరగడంతో రాకపోకలు నిలిచిపోయాయి.

ఫలితాలు ‘ఆదర్శ’ నీయం