
మా క్లినిక్‌కు వచ్చేయండి..!
విజయనగరం ఫోర్ట్:
ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి... జిల్లాకే పెద్దది. పేదలు, మధ్యతరగతి ప్రజలు ఎలాంటి అనారోగ్యానికి గురైనా తొలుత ఆశ్రయించేది ఈ ఆస్పత్రినే. అందుకే ప్రతి రోజు 1100 నుంచి 1200 మధ్యన ఓపీ నమోదవుతుంది. అయితే, కొందరు వైద్యులు ప్రభుత్వాస్పత్రిలో రోగులకు సేవలందించే అవకాశం ఉన్నా... తమ సొంత క్లినిక్‌లలో మంచి సేవలు అందిస్తామని నమ్మించే ప్రయత్నంచేస్తున్నట్టు సమాచారం. ప్రమాదాల్లో గాయపడిన వారిని, శస్త్రచికిత్సలు అవసరమైన వారిని ప్రైవేటు ఆస్పత్రులకు తరలిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రోగుల పట్ల వైద్యులు వ్యవహరిస్తున్న తీరును కొందరు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. వైద్య ఖర్చులు తట్టుకోలేక ప్రభుత్వాస్పత్రికి వచ్చిన వారిని ప్రైవేటు క్లినిక్‌లకు రావాలని చెప్పడంపై మండిపడుతున్నారు. కొంతమంది వైద్యులు అయితే చాలా కాలంగా రోగులను క్లినిక్‌లకు తరలించి ఆపరేషన్‌లు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వైద్య సేవలు ఇలా..
వైద్య సేవలు ఇలా..
ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో కంటి, ఎముకలు, న్యూరోమెడిసిన్, న్యూరో సర్జరీ, యూరాలజీ, నెఫ్రాలజీ, జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, చర్మ, దంత, ఈఎన్‌టీ, ఎన్‌సీడీ, పలమనాలజీ ఓపీ విభాగాలు ఉన్నాయి. రోజుకి సగటున 1100 నుంచి 1200 మంది వరకు రోగులు ఆస్పత్రికి వస్తారు. 270 నుంచి 300 మంది వరకు ఇన్‌పేషేంట్స్‌గా చికిత్స పొందుతారు. రోజుకు 40 నుంచి 50 మంది వరకు డిశ్చార్జ్ అవుతారు.
సర్వజన ఆస్పత్రి వైద్యుల నిర్వాకం
ఇక్కడ అయితే రెండు, మూడు రోజులు ఉండాలి
మా క్లినిక్‌లో ఆపరేషన్ చేసిన రోజే ఇంటికి పంపిస్తాం
వైద్యుల తీరుతో విస్తుపోతున్న రోగులు
‘గంట్యాడ మండలానికి చెందిన సీహెచ్ ఈశ్వరమ్మ అనే మహిళ చేతిపై చిన్నకాయను తొలగించేందుకు అవసరమైన చికిత్స కోసం కొద్ది రోజుల కిందట ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలోని ఆర్థో (ఎముకల) విభాగానికి వెళ్లారు. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యుడు ఆపరేషన్ చేసి చేతిపై ఉన్న కాయ తొలిగించాలని చెప్పారు. సర్వజన ఆస్పత్రిలో అయితే శస్త్రచికిత్స చేసిన తర్వాత రెండు, మూడు రోజులు ఉండాలని, మా క్లినిక్‌లో అయితే చేసిన రోజే ఇంటికి పంపించేస్తాం అని చెప్పారు. చీటీపై ఫోన్‌నంబర్ రాసి ఆ మహిళకు ఇచ్చారు. క్లినిక్‌లో ఆపరేషన్ చేయించుకోవడం ఇష్టంలేక ఆమె ఇంటి వద్దే ఉండిపోయారు.’
చర్యలు తీసుకుంటాం
సర్వజన ఆస్పత్రికి చికిత్స కోసం వచ్చే వారికి ఇక్కడే మెరుగైన వైద్యసేవలు అందజేయాలి. అవసరమైతే శస్త్రచికిత్స చేయాలి. క్లినిక్‌లకు రావాలని చెబితే వెంటనే రోగుల బంధువులు ఫిర్యాదు చేయాలి. ఏ వైద్యుడిపై ఫిర్యాదు అందినా కఠిన చర్యలు తీసుకుంటాం.
– డాక్టర్ సంబంగి అప్పలనాయుడు,
సూపరింటెండెంట్,
ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి

మా క్లినిక్‌కు వచ్చేయండి..!