ప్రతి నియోజకవర్గానికి విజన్ ప్లాన్
● ఉమ్మడి జిల్లా కలెక్టర్లు డాక్టర్
బీఆర్‌అంబేడ్కర్, శ్యామ్‌ప్రసాద్
విజయనగరం అర్బన్: భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా ప్రతి నియోజకవర్గానికి విజన్ ప్లాన్ రూపొందించాలని విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బీఆర్‌అంబేడ్కర్, పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్ కోరారు. క్షేత్రస్థాయి పరిస్థితులు, అందుబాటులో ఉన్న వనరులను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రణాళికలను రూపొందించాలని సూచించారు. స్వర్ణాంద్ర–2047 కెపాసిటీ బిల్డింగ్‌పై విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల అధికారులకు రెండు రోజుల వర్క్‌షాప్ బుధవారం కలెక్టరేట్‌లోని ఆడిటోరియంలో ప్రారంభమైంది. ఈ వర్క్‌షాప్‌కు హాజరైన కలెక్టర్లు అంబేడ్కర్, శ్యామ్‌ప్రసాద్ మాట్లాడుతూ ఇప్పటికే జిల్లాకు సంబంధించిన డ్రాప్ ప్లాన్‌ను రూపొందించామని అలాగే నియోజకవర్గాలకు కూడా ప్రణాళికను రూపొందించాలని చెప్పారు. క్షేత్రస్థాయి పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని నియోజకవర్గ ఎంఎల్‌ఏల సలహాలను కూడా పరిగణనలోకి తీసుకుని ప్రణాళికలను రూపొందించాలని సూచించారు. ముఖ్యంగా జిల్లాల భౌగోళిక పరిస్థితిని బట్టి వ్యవసాయ, అనుబంధ రంగాల్లో ప్రగతికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్నారు. విజయనగరం జిల్లాలో సుమారు 6,500 పైగా ఎంఎస్‌ఎంఈలు ఉన్నాయని వాటిని అభివృద్ధి చేయడం ద్వారా పారిశ్రామికంగా కూడా అభివృద్ధికి అవకాశం ఉంటుందని కలెక్టర్ అంబేడ్కర్ చెప్పారు. భోగాపురం విమానాశ్రయం పూర్తయితే పారిశ్రామిక, సేవా రంగాలు కూడా అభివృద్ది చెందుతాయన్నారు. జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి ఎంతో అవకాశం ఉందని, విజన్ 2047 డాక్యుమెంట్ భవిష్యత్ తరాలకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు.
ఉద్యాన పంటల సాగును విస్తరించాలి
మన్యం జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ అన్ని నియోజకవర్గాలకు ఒకే ప్రణాళిక పనిచేయదని, అక్కడి క్షేత్రస్థాయి పరిస్థితులను బట్టి ప్రణాళికను రూపొందించాలని సూచించారు. ప్రాథమిక రంగంలో ఉద్యాన పంటల సాగును విస్తరించడం, పశుసంపదను వృద్ధి చేయడం తదితర చర్యలపై సూచించారు. పండ్లు, కూరగాయల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. స్థానిక ప్రజాప్రతినిధుల సూచనలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. వర్క్‌షాప్‌ను విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్ బుధవారం ఉదయం ప్రారంభించారు. ముఖ్య ఆర్ధిక సూచికల ద్వారా, డేటాను సమీకరించడం, దానిని విశ్లేషించడం, ప్రణాళికలను రూపొందించడంపై శిక్షణ ఇచ్చారు. ఈ వర్క్‌షాప్‌లో ప్రణాళిక శాఖ విశ్రాంతి డైరెక్టర్, సలహాదారులు సీతాపతిరావు, మూడు జిల్లాల సీపీఓలు పి.బాలాజీ, వీర్రాజు, లక్ష్మీప్రసన్న, నియోజగకవర్గాల ప్రత్యేకాధికారులు, పర్యవేక్షణ బృందం సభ్యులు పాల్గొన్నారు.
ప్రతి నియోజకవర్గానికి విజన్ ప్లాన్


