సమస్యలపై బొత్స ఆరా
చీపురుపల్లిరూరల్(గరివిడి): వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు, శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ ప్రజల సమస్యలపై ఆరా తీశారు. వైఎస్సార్ సీపీ గరివిడి కార్యాలయంలో చీపురుపల్లి మండలానికి చెందిన నాయకులు, కార్యకర్తలతో శుక్రవారం సమావేశమయ్యారు. ఉపాధి హామీ బిల్లుల పెండింగ్‌పై ఆరా తీశారు. కొత్త పింఛన్ల పంపిణీ తీరును నాయకులను అడిగి తెలుసుకున్నారు. 75 రోజులుగా ఉపాధి హామీ బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో వేతనదారులు ఇబ్బందులు పడుతున్నారని స్థానిక నాయకులు బొత్సకు వివరించారు. ఈ సమస్యపై ఆయన పంచాయతీరాజ్ కమిషనర్‌తో ఫోన్లో మాట్లాడారు. 75 రోజులుగా వేతనదారులకు బిల్లులు చెల్లించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. దీనిపై కమిషనర్ స్పందిస్తూ సోమవారం బిల్లులు మంజూరవుతాయని చెప్పారు. చీపురుపల్లి నియోజకవర్గంలో పింఛన్ల కోసం 800 మంది అర్హులు ఉన్నా ఎవరికీ మంజూరు కాలేదని స్థానిక నాయకులు బొత్సకు తెలియజేశారు. చీపురుపల్లి మండలంలోని పర్ల గ్రామానికి చెందిన నేవీ కమాండర్ ప్రమాదంలో మరణించినప్పటికీ ఆయన కుటుంబానికి చెందాల్సిన ఐదు ఎకరాల భూమి ఇంత వరకు రాలేదని గ్రామానికి చెందిన నాయకులు ఆయన దృష్టికి తీసుకురాగా కలెక్టర్‌తో ఫోన్లో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని తెలియజేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నాడు–నేడు పనులు చురుగ్గా జరిగేవని, ఆ పనులు ఇప్పడు జరుగుతున్నాయా అని నాయకులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో విజయనగరం మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, వైఎస్సార్సీపీ మండల నాయకుడు ఇప్పిలి అనంతం, జిల్లా ప్రచార విభాగం అధ్యక్షుడు వలిరెడ్డి శ్రీనివాసులనాయుడు, పార్టీ మండలాధ్యక్షుడు మీసాల వరహాలనాయుడు, నియోజకవర్గ విభాగం అధ్యక్షుడు బెల్లాన వంశీకృష్ణ, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
గరివిడి వైఎస్సార్సీపీ కార్యాలయంలో
చీపురుపల్లి మండల నాయకులతో సమావేశం


