
ఫ్యాప్టో ఆందోళన రేపు
విజయనగరం అర్బన్: ఉపాధ్యాయ సమస్యల సాధన కోసం ఈ నెల 2న కలెక్టరేట్ ఎదుట నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాన్ని విజయవతం చేయాలని ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) జిల్లా కమిటీ పిలుపునిచ్చింది. స్థానిక దాసన్నపేట ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో సోమవారం ఫ్యాప్టో జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. కమిటీ చైర్మన్ పి.శ్రీనివాసరావు మాట్లాడుతూ తక్షణమే 30 శాతం ఐఆర్‌ను ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పీఆర్‌సీ కమిటీ నియమించాలని, పెండింగ్‌లో ఉన్న 3 డీఏలను చెల్లించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న పీఆర్‌సీ ఎరియర్స్‌ను, సరెండర్ లీవు బకాయిలు చెల్లించాలని కోరారు. దీనికోసం పోరుబాట సాగిద్దామన్నారు. అనంతరం ఐక్య నినాదం వినిపించారు. కార్యక్రమంలో వివిధ సంఘాల ప్రతినిధులు కె.జోగారావు, సూరిబాబు, పి.దామోదరనాయుడు, జేఆర్‌కేవీఈశ్వరరావు, భాస్కరరావు, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.