
తెలుగువారి ఆత్మగౌరవం పొట్టి శ్రీరాములు
విజయనగరం అర్బన్:
అమరజీవి పొట్టి శ్రీరాములు భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కృషి చేశారని, ఆ మహానుభావుడు తెలుగు వారి ఆత్మ గౌరవమని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలిపారు. అమరజీవి చిరస్మరణీయులని ప్రతి ఒక్కరూ ఆయన చూపిన బాటలో నడవాలని పిలుపునిచ్చారు. నేటి తరానికి ఆయన స్ఫూర్తిదాయకం కావాలని ఆకాంక్షించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిని అధికారికంగా జరుపుకోవడం చాలా సంతోషకరమని అన్నారు. తెలుగు రాష్ట్రం ఆయన చేసినటువంటి కృషిని గుర్తించిందన్నారు. తెలుగు రాష్ట్ర ప్రజలు పొట్టి శ్రీరాములు చూపిన దారిలో నడవాలని తద్వారా ఆయన ఆకాంక్షలను నెరవేర్చాలన్నారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి యు.మాణిక్యంనాయుడు, మైనారిటీ సంక్షేమ అధికారి ఆర్‌ఎస్ జాన్, ఇన్‌చార్జి జేసీ శ్రీనివాసమూర్తి, కలెక్టరేట్ ఏఓ దేవ్‌ప్రసాద్, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
● కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్