
భామిని: మండలంలోని గజపతినగరం సమీపంలోకి ఆదివారం ఏనుగుల గుంపు చేరుకుంది. గ్రామసమీపంలోని పంటలను ధ్వంసం చేస్తూ, తినివేస్తూ ప్రయాణం సాగిస్తున్నాయి. ఏబీ రోడ్డు పక్కన నాలుగు ఏనుగులు తిష్ఠ వేయడంతో ప్రజలు, వాహనదారులు బెదిరిపోతున్నారు. ఏనుగుల బారి నుంచి పంట నష్టాన్ని తప్పించాలని రైతులు కోరుతున్నారు.
స్కూల్ గేమ్స్ రాష్ట్ర జట్టు సభ్యులకు ప్రోత్సాహకం
విజయనగరం అర్బన్: అండమన్ నికోబార్ దీవుల్లో డిసెంబర్ 4వ వారంలో జరిగే స్కూల్‌గేమ్స్ అండర్–17 ఫుట్‌బాల్ జాతీయ స్థాయి పోటీల్లో రాష్ట్ర జట్టు నుంచి ఆడనున్న ముగ్గురు క్రీడాకారులకు సీతం ఇంజినీరింగ్ కళాశాల యాజమాన్యం ప్రోత్సాహకాలు అందజేసి ఆదివారం ఘనంగా సత్కరించింది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీలలో జిల్లా జట్టు ప్రథమ స్థానంలో నిలిచిందని ఈ పోటీలలో ప్రతిభ చూపిన పట్టణానికి చెందిన బూర్లి జయసూర్య, ఆదుర్తి చైతన్య, కేసలి ఝాన్సీరాజ్‌లు రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యారని తెలుసుకుని సత్కరించామని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డీవీరామమూర్తి తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ మజ్జి శశిభూషణరావు, అధ్యాపకులు పాల్గొన్నారు.
జూనియర్ కళాశాలల్లో ‘హెచ్‌సీఎల్ టెక్‌బీ’ బృందం పర్యటన
● ఉద్యోగావకాశాలపై అవగాహన
విజయనగరం అర్బన్: డిగ్రీ చదువులు పూర్తయిన తరువాత ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయో అవగాహన కలిగించడానికి ఇంటర్ రెండవ సంవత్సరం విద్యార్థుల కోసం ‘హెచ్‌సీఎల్ టెక్‌బీ’ సంస్థ ప్రతినిధులు జిల్లాలోని జూనియర్ కళాశాలల్లో పర్యటిస్తారని ప్రాంతీయ ఇంటర్మీడియెట్ పర్యవేక్షణ అధికారి (ఆర్‌ఐఓ) మజ్జి ఆదినారాయణ ఆదివారం తెలిపారు. ఇందుకోసం విద్యార్థులు ‘హెచ్‌సీఎల్‌టెక్‌బీఈఈ.కాం’ వెబ్‌సైట్‌లో పేర్లను తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. సంబంధిత అన్ని మేనేజ్‌మెంట్ కళాశాలల ప్రిన్సిపాళ్లు, తల్లిదండ్రులు స్పందించిన విద్యార్థులతో పేర్లను నమోదు చేయించే ప్రక్రియను పర్యవేక్షించాలని సూచించారు. పూర్తి వివరాల కోసం సాయికిరణ్ 96429 73350, గురునాధ్ 77807 54278, యుగేష్ 63003 78377 నంబర్లకు సంప్రదించాలని సూచించారు.

ఏనుగుల గుంపును తిలకిస్తున్న గ్రామస్తులు