
వైఎస్సార్ సీపీతోనే సామాజిక న్యాయం: ఉపముఖ్యమంత్రి ముత్యాలనాయుడు
వైఎస్సార్‌సీపీతోనే సామా జిక న్యాయం సాధ్యమని జిల్లా ఇన్‌చార్జి మంత్రి, ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు అన్నారు. మంత్రివర్గంలోని 25 మందిలో 17 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల నేతలకు అవకాశం కల్పించారని గుర్తుచేశారు. దేశంలో తొలిసారిగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, ఓసీల నుంచి ఒక్కో ఉపముఖ్యమంత్రిని చేయడం జగన్‌మోహన్‌రెడ్డి పాలనలోనే సాధ్యమైందని చెప్పారు. బడుగు బలహీనవర్గాల అక్కచెల్లెమ్మలే సభ్యులుగా ఉన్న డ్వాక్రా సంఘాల రుణాలను మాఫీ చేస్తానని చంద్రబాబు మోసం చేసిన విషయా న్ని గుర్తు చేశారు. జగన్‌మోహన్‌రెడ్డి పాద యాత్రలో హామీ మేరకు ఇప్పటికే మూడు దఫా ల్లో సొమ్ము చెల్లించారని, జనవరిలో నాలుగో దఫా ఇవ్వనున్నారని చెప్పారు. వైఎస్సార్ చేయూత, ఆసరా, రైతు భరోసా, విద్యాదీవెన, జగనన్న గోరుముద్ద, ఆరోగ్యశ్రీ ఇవన్నీ సామా జిక వర్గాల ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలని వెల్లడించారు.
అభివృద్ధి అంటే ఇదే:
స్పీకర్ తమ్మినేని
సామాజిక సాధికార బస్సుయాత్రకు వచ్చిన ప్రజాస్పందన చూస్తుంటే జగన్‌మోహన్‌రెడ్డి సర్కారు సాగిస్తున్న సంక్షేమ, అభివృద్ధి పాలనను ఏ స్థాయిలో స్వాగతిస్తున్నారో స్పష్టంగా తెలుస్తోందని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ఈ యాత్రలతో రానున్న ఎన్నికల ఫలితాలు ఇప్పుడే కనిపిస్తున్నాయన్నారు. తాండ్ర పాపారాయుడు పుట్టిన రాజాం గెడ్డపై అవినీతికి తావులేదని, ఇక్కడ ప్రజాసేవ చేసిన వారినే ప్రజలు గెలిపిస్తారని పేర్కొన్నారు. మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామస్వరాజ్యం, అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం, పూలే ఆశయాలు వంటివన్నీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమే అమలు చేయగలుగుతున్నారన్నారు. రాష్ట్రంలో ప్రతిపేదవాడు ఆర్థికంగా అభివృద్ధి చెందాడని, రాష్ట్రంలో జీడీపీ పెరిగిందని, పారిశ్రామిక వేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు విశాఖపట్నం వస్తున్నారని తెలిపారు. పేదలకు కార్పొరేట్ స్థాయి విద్య అందుబాటులోకి వచ్చిందన్నారు.
