
రేగిడి: ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి తమ కుటుంబాన్ని దేవుడిలా ఆదుకున్నారని కందిశ గ్రామానికి చెందిన కేన్సర్ బాధిత బాలిక గంటి హేమలత తల్లిదండ్రులు కన్నబాబు, లావణ్యలు తెలిపారు. గత నెల 3వ తేదీన విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్‌పోర్టు శంకుస్థాపనకు వచ్చిన సమయంలో వావిలవలస గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త పాలూరి సిద్దార్ధ సహాయంతో హేమలత పరిస్థితిని ముఖ్యమంత్రికి తెలియజేశారు. ఆయన మానవతా దృక్ఫథంతో స్పందించి పాపకు మెరుగైన వైద్యం అందించి అన్ని విధాలుగా ఆదుకుంటామని మాటిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారంగా ఇటీవల లక్ష రూపాయలను కుటుంబానికి అందజేశారు. హేమలతకు చికిత్స అందించేందుకు విశాఖపట్నం ప్రసాద్ ఐ ఆస్పత్రికి శుక్రవారం తీసుకెళ్లారు. పాప వైద్యం కోసం రూ.38 వేలు ఖర్చు అయిందని, ఆ డబ్బులను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డే కడతారని, మీరు ఒక్క రూపాయి కూడా చెల్లించవద్దని ఆస్పత్రి వర్గాలు తెలియజేసినట్టు లావణ్య, కన్నబాబు ఆనందం వ్యక్తం చేశారు. సీఎం మేలు మరచిపోలేమన్నారు.
ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన కేన్సర్ బాధిత బాలిక తల్లిదండ్రులు