విజయనగరం అర్బన్: జిల్లాలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న విభిన్న ప్రతిభావంతుల బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేయడానికి కలెక్టర్ ఎ.సూర్యకుమారి ఆదివారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన అర్హులైన విభిన్న ప్రతిభావంతులు (దివ్యాంగుల) నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ఈ నెల 27వ తేదీ నుంచి ఏప్రిల్ 10వ తేదీ వరకు చేపట్టినట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. దరఖాస్తు చేసిన నాటికి అభ్యర్ధి వయసుంస ఒకటి జూలై 2023 నాటికి 18 సంవత్సరాలు నిండి ఉండాలి. గరిష్ట వయసు 52 సంవత్సరాలు దాట కూడదు. అర్హులైన విభిన్న ప్రతిభావంతులు దరఖాస్తులను జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ప్రాంగణంలో గల విభిన్న ప్రతిభావంతులు/వయోవృద్ధుల సంక్షేమ శాఖ, రూమ్ నంబర్ 34, కలెక్టరేట్, విజయనగరం’ అనే అడ్రస్‌కు రిజిస్టర్డ్ పోస్టు ద్వారా గానీ స్వయంగా గానీ అందజేయాలని స్పష్టం చేశారు.
పోస్టుల వివరాలిలా..
గ్రూప్–4 (డీఎస్సీ) పోస్టులు: జూనియర్ సహాయకులు–3. వాటిలో బధిరులకు (చెముడు) జనరల్ కోటా–1, చలన సంబంధం (ఓహెచ్) జనరల్–2 ఉన్నాయి. క్లాస్–4 ఇతర కేటగిరీలకు చెందిన పోస్టులు: ఆఫీస్ సబార్డినేట్ (చలన సంబంధం)–1 (జనరల్ కోటా), నైట్ వాచ్‌మన్: దృష్టి లోపం (అంధులకు)–1 (జనరల్ కోటా), బధిరులు (మూగ చెముడు)–1 (జనరల్ కోటా), దోబీ/చెక్లర్/స్వీపర్: బధిరులు (మూగ చెముదు)– 1(మహిళ కోటా), ఏఎన్‌ఎం: బధిరులు (మూగ చెముడు) –1 (మహిళ) మొత్తం 8 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైందని విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకుడు జీవీబీజగదీష్ తెలిపారు. పూర్తి నోటిషికేషన్, దరఖాస్తు నమూనా కోసం ‘విజయనగరం.ఏపీ.జీఓవీ.ఐఎన్’ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు. పూర్తి సమాచారం/సందేహ నివృత్తి కోసం ఫోన్ నంబర్ 08922–274647లో సంప్రదించాలని తెలియజేశారు.
విభిన్న ప్రతిభావంతుల నుంచి
దరఖాస్తుల ఆహ్వానం