గ్యాస్ బుకింగ్‌లో ఏజెన్సీలు, కంపెనీల కిరికిరి పెరుగుతున్న గ్యాస్ బుకింగ్ జాబితా రోజుకు 18 వేల మందికి గ్యాస్ సిలిండర్ల సరఫరా అయినా గ్యాస్ ఏజెన్సీల వద్ద బారులు తీరుతున్న జనం
గ్యాస్ సరఫరాలో
మహారాణిపేట: విశాఖ నగరంలో వంట గ్యాస్ బుకింగ్‌లో ఓటీపీ మాయాజాలం నడుస్తోంది. ఆన్‌లైన్ బుకింగ్ ప్రక్రియ అక్రమాలకు నిలయంగా మారింది. ఓటీపీ వచ్చి వారం రోజుల తర్వాత గ్యాస్ వస్తోందని ఏజెన్సీలు చెబుతున్నాయి. పది పదిహేను రోజులైనా రాకపోవడంతో సిలిండర్ పట్టుకుని వినియోగదారులు గ్యాస్ ఏజెన్సీల వద్ద క్యూ కడుతున్నారు. అక్కడకు వెళ్లినా ఇంకా మీ గ్యాస్ రాలేదని ఏజెన్సీల నుంచి సమాధానం వస్తోంది. దీంతో గ్యాస్ బుక్ చేసిన వినియోగదారులకు సరఫరా ఎగ్గొట్టి సిలిండర్లను పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
కొరత లేదని చెప్తున్నా..
నగరంలో హెచ్‌పీసీఎల్, భారత్, ఐవోసీ గ్యాస్ కంపెనీలు వంట గ్యాస్, కమర్షియల్ గ్యాస్ సరఫరా చేస్తున్నాయి. కమర్షియల్ గ్యాస్ సరఫరాపై ఆంక్షలు విధించడంతో ఆచూతూచి సరఫరా చేస్తున్నారు. దీంతో విపరీతమైన డిమాండ్ పెరిగిపోయింది. విశాఖలో మొత్తం 62 గ్యాస్ ఏజెన్సీల్లో 8 లక్షల 90 వేల డొమెస్టిక్ కనెక్షన్లు ఉన్నాయి. నేటికి లక్షా 65 వేల మందికి పైగా గ్యాస్ బుక్ చేశారు. వీరికి గతంలో ఓటీపీ నెంబర్ వచ్చాక ఒకట్రెండు రోజుల్లోనే సిలిండర్ వచ్చేదని, ఇప్పుడు ఓటీపీ వచ్చి 10–15 రోజులవుతున్నా.. సిలిండర్ డెలివరీ కావట్లేదని వినియోగదారులు వాపోతున్నారు. వంట గ్యాస్‌కు ఎలాంటి కొరత లేదని జిల్లా అధికారులు చెబుతున్నా.. వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి.
ఏజెన్సీలపై తీవ్ర ఒత్తిడి
వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్ మీద ప్రభుత్వం ఇప్పటికే పలు అంక్షలు విధించింది. 40 శాతం మేర సరఫరా తగ్గించారు. ఇప్పుడు డొమెస్టిక్ గ్యాస్‌పై కూడా ఆంక్షలు వస్తాయన్న పుకార్లు షికార్లు చేస్తున్నాయి. బుకింగ్‌కు బుకింగ్‌కు మధ్య కనీసం 25 రోజుల వ్యవధి ఉండాలి. దీంతో ఖాళీ సిలిండర్లున్నవారు, ఒకట్రెండు వారాల్లో సిలిండర్ ఖాళీ అవుతుందనుకునేవాళ్లు తమ గడువు తీరిన వెంటనే బుకింగ్ చేస్తున్నారు. దీంతో ఏజెన్సీలపై ఒత్తిడి పెరుగుతోంది.
పెరుగుతోన్న బుకింగ్ జాబితా
వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా పలు ఎల్‌పీజీ బాట్లింగ్ ప్లాంట్ల నుంచి జిల్లాకు సాధారణ స్థాయిలోనే సిలిండర్లు సరఫరా అవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. మూడు నెలల గణాంకాలను పరిశీలిస్తే రోజుకు 18 వేలు చొప్పున సిలిండర్లు వస్తున్నాయి. యుద్దం నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వదంతులతో ప్రస్తుతం రోజుకు 25 వేల వరకు అందిస్తున్నారు. ఇప్పటికే లక్షా 65 వేల సిలిండర్లకు బుకింగ్ ఉంది. ఈ జాబితా రోజు రోజుకూ పెరుగుతోంది.
డొమెస్టిక్ సిలిండర్ పక్కదారి?
మరోవైపు డొమెస్టిక్ సిలిండర్లు టీ, టిఫిన్ దుకాణాలు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, హోటళ్ల బాట పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఇటీవల అధికారుల దాడుల్లో దొరికిన సిలిండర్లు ఈ ఆరోపణలను నిజం చేస్తున్నాయి. గ్యాస్ ఏజెన్సీలు, డెలివరీ బాయ్స్ కుమ్మకై ్క.. డొమెస్టిక్ సిలిండర్ల బుకింగ్‌లు తామే జరిపి, సిలిండర్లను బహిరంగ మార్కెట్లో వాణిజ్య వినియోగదారులకు రెండింతలు, మూడింతల ధరకు విక్రయిస్తున్నారన్న విమర్శలున్నాయి. కొందరు వినియోగదారులు తాము బుక్ చేయకుండానే తమ మొబైళ్లకు ఓటీపీలు వస్తున్నాయని, తమ సిలిండర్లను హోటళ్లు, రెస్టారెంట్లకు అమ్ముకుంటున్నారని ఆరోపిస్తున్నారు.


