వివాదమంతా కొత్తవలస – కిరండూల్ (కేకే లైన్) చుట్టూనే తిరుగుతోంది. ఛత్తీస్‌గఢ్‌లోని గనుల నుంచి ఇనుప ఖనిజాన్ని విశాఖ స్టీల్ ప్లాంట్, పోర్టుకు తరలించే ఈ మార్గం భారత రైల్వేలోనే అత్యధిక ఆదాయం ఇచ్చే సెక్షన్లలో ఒకటి. ఈ ఒక్క లైన్ ద్వారానే ఏడాదికి సుమారు రూ. 9 వేల కోట్ల ఆదాయం వస్తుంది. ప్రస్తుతం ఈ ఆదాయం ఒడిశా కేంద్రంగా ఉన్న ఈస్ట్ కోస్ట్ రైల్వేకు వెళ్తోంది. కొత్త జోన్ వస్తే ఈ ఆదాయం ఏపీకి చెందుతుందన్న భయంతో, ఒడిశా ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఈ లైన్‌ను రాయగడ డివిజన్‌లో కలిపించుకుంది. రైల్వే బోర్డు కూడా ఒడిశా ఒత్తిళ్లకు తలొగ్గి, లాభసాటి మార్గాలను అక్కడ ఉంచి.. కేవలం ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండి, నిర్వహణ ఖర్చులు భారమయ్యే స్టేషన్లను మాత్రమే ఆంధ్రాకు కేటాయిస్తోంది.


