ఆరిలోవ: ప్రముఖ పర్యాటక కేంద్రం కై లాసగిరి సందర్శన కోసం వెళ్లే వాహనాలకు వీఎంఆర్‌డీఏ అధికారులు వాహనాల టికెట్ ధరలను తగ్గించారు. ఈ నెల 2న ఏర్పాటు చేసిన విస్టా యాప్ పేరిట టోల్‌ప్లాజా వద్ద సిబ్బంది వాహనాల టిక్కెట్లతో పాటు, వాహనాల్లో ఉండే సందర్శకుల నుంచి తలో రూ.10 చొప్పున వసూలు చేశారు. దీనిపై ఈ నెల 3న ‘కైలాసగిరి పర్యాటకులకు వీఎంఆర్‌డీఏ షాక్’శీర్షికతో సాక్షిలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. వాహనాల టికెట్ల ధరలు తగ్గిస్తున్నట్లు వీఎంఆర్‌డీఏ కమిషనర్ ఎన్.తేజ్‌భరత్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. వాహనాల టికెట్ ధరలు తగ్గించి వాహనాల్లో ప్రయాణించే పర్యాటకులకు తలో రూ.10 చొప్పున టికెట్ తీయాలన్నారు. ఇంతవరకు ద్విచక్రవాహనానికి చెల్లించే రూ.20 టికెట్ ధర రూ.10కి, ఐదుగురు కూర్చొనే నాలుగు చక్రాల వాహనానికి రూ.50 నుంచి రూ.30కి, ఐదుగురు కంటే ఎక్కువ మంది కూర్చునే నాలుగు చక్రాల వాహనానికి రూ.70 నుంచి రూ.50కి, మినీ బస్‌కు రూ.150 నుంచి రూ.100కు, పెద్ద బస్‌కు రూ.300 నుంచి రూ.150కి తగ్గించినట్లు కమిషనర్ పేర్కొన్నారు. ఆ ధరలతో పాటు ఆయా వాహనాల్లో ఎంతమంది పర్యాటకులు ఉంటే అందరూ రూ.10 చొప్పున చెల్లించాలన్నారు. విస్టా యాప్ పర్యాటకులకు సౌకర్యవంతం, ఉపయుక్తంగా ఉంటుందన్నారు. అయితే వాహనాల ధరలు తగ్గించామంటూనే.. విస్టా యాప్ పేరిట వాహనాల్లో ఉండేవారి నుంచి అదనంగా రూ.10 చొప్పున వసూలు చేయడంపై పర్యాటకుల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి.
వీఎంఆర్‌డీఏ కమిషనర్ ఎన్.తేజ్‌భరత్


