ఒంటరితనాన్ని తరిమికొట్టి..
ఆత్మీయతను పంచుతూ శిల్పారామంలో సామూహిక పుట్టినరోజులు
దశాబ్దపు బంధం.. దశ దిశలా స్ఫూర్తి
రెక్కలొచ్చిన పిల్లలు దూరమైనా..
తోటి స్నేహితులే అండగా..
జాతర వాకర్స్ అసోసియేషన్ ఆదర్శం
మలిసంధ్యలో
జాతర వాకర్స్ అసోసియేషన్ ఈ సామూహిక పుట్టినరోజు వేడుకలకు దశాబ్దం కిందటే శ్రీకారం చుట్టి సమాజానికి ఆదర్శంగా నిలిచింది. అసోసియేషన్‌లో సభ్యత్వం తీసుకున్న వారు జనవరిలో కొంత నగదును డిపాజిట్ చేస్తారు. ప్రతి నెలా వచ్చే మొదటి ఆదివారం ఆ నెలలో పుట్టిన సభ్యులందరికీ సామూహికంగా వేడుకలు నిర్వహిస్తారు. అందరి సమక్షంలో కేక్ కట్ చేయించడం, బొకేలు అందజేసి శుభాకాంక్షలు తెలపడం వంటి కార్యక్రమాలతో ఆ ప్రాంతమంతా పండగ వాతావరణం నెలకొంటుంది. అత్యంత క్రమశిక్షణతో, ఆరోగ్యకరమైన వాతావరణంలో జరిగే ఈ విందు వినోదాలు సీనియర్ సిటిజన్ల బాధ్యతాయుత ప్రవర్తనకు అద్దం పడతాయి.
అనుబంధాలకు నెలవుగా వాకర్స్ వేదిక
ఇక్కడ ప్రతిరోజూ పండగే. సామూహిక వేడుకలే కాకుండా కొందరు సభ్యులు తమ పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలను కూడా ఈ వేదికపైనే జరుపుకుంటారు. ఇంట్లో జరిగే శుభకార్యాలను సైతం తోటి వాకర్స్ మధ్య జరుపుకోవడం ఇక్కడి ప్రత్యేకత. జాతీయ పర్వదినాలు, పండుగలను కూడా తమదైన శైలిలో నిర్వహిస్తూ ఈ అసోసియేషన్ ఒక కుటుంబంలా విరాజిల్లుతోంది. కేవలం వేడుకలే కాదు, ఆరోగ్యం పట్ల కూడా వీరు అంతే శ్రద్ధ చూపుతారు. ప్రతిరోజూ ఉదయం ఆరు గంటలకే శిల్పారామం చేరుకుని గంటపాటు వాకింగ్, వ్యాయామం, యోగా చేసిన తర్వాతే ఈ ఆనంద కార్యక్రమాల్లో పాలుపంచుకుంటారు.
ఆత్మీయతే ఆయువుపట్టు
‘రెక్కలు వచ్చిన పిల్లలు విదేశాల్లోనో, ఇతర నగరాల్లోనో స్థిరపడటంతో చాలామంది వృద్ధులు ఇళ్లకు పరిమితమై ఒంటరితనంతో బాధపడుతుంటారు. అలాంటి వారికి ఈ వేడుకలు కొండంత బలాన్ని ఇస్తున్నాయి’ అని సభ్యులు ఆనందంగా చెబుతున్నారు. 80 ఏళ్ల వయసులో కూడా మర్చిపోయిన పుట్టినరోజును గుర్తుచేసి వేడుక చేయడం, తోటి సభ్యుల నడుమ కేక్ కట్ చేయడం మాటల్లో చెప్పలేని మధురానుభూతిని కలిగిస్తోంది. ‘ఇక జీవితం అయిపోయింది’ అనే నైరాశ్యంలో ఉన్నవారికి, ఈ వేడుకలు మరికొన్ని ఏళ్లు ఆరోగ్యంగా, ఉత్సాహంగా జీవించగలమనే భరోసానిస్తున్నాయి. ఆరోగ్యం, ఆహ్లాదం, ఆనందం ఒకే చోట దొరికే ఈ ‘జాతర’ మలిసంధ్య జీవితాలకు సరికొత్త కాంతిని ఇస్తోంది.
నేటి ఆధునిక కాలంలో పుట్టినరోజు అంటే కేవలం యువతకో, లేదా అప్పుడే ఏడాది నిండిన చిన్నారులకో పరిమితమైన పండగలా మారిపోయింది. యువత విందు వినోదాల కోసం తహతహలాడితే, తల్లిదండ్రులు తమ పిల్లల వేడుకను ఘనంగా చేసేందుకు ఉబలాటపడుతుంటారు. కానీ అరవై–డైబ్బె ఏళ్లు దాటిన మలిసంధ్య వయసు వారికి పుట్టినరోజు అంటే ఓ జ్ఞాపకం. అసలు తమ పుట్టిన తేదీ ఏదో కూడా స్పష్టంగా తెలియని పరిస్థితి వారిది. పదో తరగతి మార్కుల జాబితాలో నమోదైన తేదీనే ఆధారంగా చేసుకుని బతుకుతున్న ఆ తరం వారికి, విశాఖలోని శిల్పారామం (జాతర) వేదికగా జరుగుతున్న పుట్టినరోజు వేడుకలు కొత్త ఉత్సాహాన్ని, జీవితేచ్ఛను ప్రసాదిస్తున్నాయి. ఇక్కడ తోటి స్నేహితులే బంధువులై, ఆత్మీయతే కానుకగా సామూహిక వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. – పీఎం పాలెం


