తగరపువలస: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం వేళ భీమిలి నియోజకవర్గంలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. లక్ష్మీపురం పంచాయతీకి చెందిన రెండు వర్గాల కార్యకర్తలు రక్తమోడేలా రాళ్లతో కొట్టుకున్నారు. ఆదివారం మజ్జివలస కూడలిలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసే క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మొదటి నుంచి టీడీపీలో ఉన్న చెందిన కనకల సూరిబాబు వర్గం, గత ఎన్నికల ముందు టీడీపీలో చేరిన గాడు తాతినాయుడు, జెడ్పీటీసీ సభ్యుడు గాడు వెంకటప్పడు వర్గం ఒకేసారి విగ్రహం వద్దకు చేరుకున్నాయి. పార్టీ మండల అధ్యక్షుడు సరగడ అప్పారావుతో ముందుగా దండ వేయించాలని తాతినాయుడు వర్గం వేచి ఉండగా, సూరిబాబు వర్గం పూలమాలలు వేసేందుకు ముందుకు వచ్చింది. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం పెరిగి భౌతిక దాడికి దారితీసింది. సుమారు అరగంట పాటు సాగిన ఈ ఘర్షణలో రాళ్లు రువ్వుకోవడంతో కనకల సూరిబాబుకు తల పగిలి తీవ్ర రక్తస్రావమైంది. అలాగే తాతినాయుడు వర్గానికి చెందిన మొకర శంకరరావుకు పన్ను విరిగిపోయింది. గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆస్పత్రులకు తరలించారు.
ఎంపీ, ఎమ్మెల్యే వర్గాల మధ్య ఘర్షణ
కనకల సూరిబాబు వర్గం ఎంపీ శ్రీభరత్, మండల మాజీ అధ్యక్షుడు డీఏఎన్ రాజు అనుచరులుగా ఉండగా.. తాతినాయుడు వర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అనుచరులుగా చలామణి అవుతున్నారు. ఏడాది కిందట పార్టీ మండల అధ్యక్షుడి నియామకం సందర్భంగా పార్టీ నిలువుగా చీలిపోయింది. గత ఐదేళ్లూ పార్టీలో లేని వారు ఇప్పుడు వచ్చి తమను అడ్డుకోవడంపై సూరిబాబు వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కాగా, ఎంపీ, ఎమ్మెల్యేలు ఈ గొడవలను సర్దుబాటు చేయకుండా విద్వేషాలు పెంచి పోషిస్తున్నారని మిగిలిన టీడీపీ నాయకులు వాపోతున్నారు. పార్టీ అధిష్టానం కల్పించుకోకపోతే తమ దారి తాము చూసుకుంటామని సూరిబాబు వర్గం హెచ్చరిస్తోంది.


