కనులపండువగా కల్యాణోత్సవం
సింహాచలం : సింహగిరిపై ఉన్న పురాతన రామాలయంలో శుక్రవారం శ్రీరామనవమిని పురస్కరించుకుని సీతారాముల కల్యాణోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ఈ కల్యాణ వేడుకను కనులారా తిలకించి భక్తిపారవశ్యంలో మునిగితేలారు. సీతారామలక్ష్మణ సమేత ఆంజనేయస్వామివారి ఉత్సవమూర్తుల సమక్షంలో విష్వక్సేనపూజ, మాంగల్యధారణ, తలంబ్రాలు తదితర ఘట్టాలను దేవస్థానం స్థానాచార్యులు టీపీ రాజగోపాల్, ప్రధానార్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, కరి సీతారామాచార్యులు, అర్చకులు గిరి, కుమార్, అప్పాజి తదితరులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు కల్యాణ అక్షింతలు, ప్రసాదాలు పంపిణీ చేశారు. దేవస్థానం ఈవో జె.వెంకటరావు, ఏఈవోలు ఏర్పాట్లు పర్యవేక్షించారు.


