అల్లిపురం: నగరంలో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు చెక్ పెట్టేందుకు పోలీస్ కమిషనరేట్ సరికొత్త సాంకేతికతను సిద్ధం చేసింది. ముఖ్యంగా యువత హెల్మెట్ లేకుండా వాహనాలు నడపడం, ట్రిపుల్ రైడింగ్, జిగ్–జాగ్ డ్రైవింగ్ , మితిమీరిన వేగంతో ప్రయాణించడం వంటి చర్యలను అరికట్టేందుకు అత్యాధునిక స్పీడ్ గన్‌లను రంగంలోకి దించుతున్నారు. జీవీఎంసీ సహకారంతో సుమారు రూ.18 లక్షలు విలువచేసే రెండు స్పీడ్ లేజర్ గన్‌లను శుక్రవారం నగర పోలీస్ కమిషనరేట్‌లో పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చికి జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ అందజేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ రహదారి భద్రతలో భాగంగా ఇప్పటికే ట్రాఫిక్ సిబ్బందికి ఏసీ హెల్మెట్లు, కూల్ రేడియం జాకెట్లు పంపిణీ చేశామని, దీనివల్ల సిబ్బంది సౌకర్యవంతంగా విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. నగరంలో రోజురోజుకీ పెరుగుతున్న వాహనాల రద్దీ వల్ల ప్రమాదాలు కూడా పెరుగుతున్నాయని, కొందరు వాహనదారులు నిబంధనలు అతిక్రమించడం వల్ల అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారని కమిషనర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదాలను నివారించేందుకు ఎలక్ట్రానిక్ ఆధారిత ఎన్‌ఫోర్స్‌మెంట్‌ను బలోపేతం చేయాలని నిర్ణయించామన్నారు. ఈ కొత్త స్పీడ్ లేజర్ గన్‌లు 100 మీటర్ల దూరం నుండే వాహనాల వేగాన్ని, హెల్మెట్ లేని ప్రయాణికులను, ట్రిపుల్ రైడింగ్ , రాంగ్ రూట్ డ్రైవింగ్‌ను పసిగట్టగలవు. వీటిని నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ ద్వారా అనుసంధానం చేసి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా రియల్ టైమ్‌లో కాంటాక్ట్ – లెస్ పద్ధతిన చలానాలు విధించడం జరుగుతుందని ఆయన వివరించారు. త్వరలోనే సౌత్ ఏషియన్ ఎల్‌పీజీ సంస్థ నుంచి మరో 18 లక్షల విలువైన స్పీడ్ గన్‌ను సీఎస్‌ఆర్ కింద అందుకోనున్నట్లు సీపీ వెల్లడించారు. కార్యక్రమంలో పాల్గొన్న జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ మాట్లాడుతూ ఈ సాంకేతికత ద్వారా నగరంలో ట్రాఫిక్ నియంత్రణతో పాటు ప్రమాదాలు గణనీయంగా తగ్గుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే నగరంలోని వ్యాపార సముదాయాలు తప్పనిసరిగా సెల్లార్ పార్కింగ్‌లను క్రమబద్ధీకరించుకోవాలని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు.


