జీడీపీ వృద్ధిలో నిర్మాణ రంగం పాత్ర కీలకం
ఎంవీపీకాలనీ: దేశ జీడీపీ వృద్ధిలో నిర్మాణరంగం పాత్ర అత్యంత కీలకమని రాష్ట్ర ఎంఎస్‌ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఎంవీపీ కాలనీ గాదిరాజు ప్యాలెస్ వేదికగా క్రెడాయ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 11వ ప్రాపర్టీ ఎక్స్‌పోను ఆయన శుక్రవారం ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు, గంటా శ్రీనివాసరావు, విష్ణుకుమార్ రాజులతో కలిసి ఆయన జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ నెల 21వ తేదీ వరకు కొనసాగే ఈ ప్రదర్శన ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశ , రాష్ట్రాల వృద్ధిరేటు పెంపులో రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాలు దశాబ్దాలుగా క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాయని కొనియాడారు. ఈ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున కృషి చేస్తోందని వివరించారు.వినియోగదారులకు నమ్మకమైన సేవలు అందించడమే లక్ష్యంగా క్రెడాయ్ వంటి సంస్థలు పనిచేయాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా క్రెడాయ్ విశాఖ చాప్టర్ చైర్మన్ వి. ధర్మేందర్, అధ్యక్షుడు ఇ. అశోక్‌కుమార్ మాట్లాడుతూ విశాఖలో ఆస్తి కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ ఎక్స్‌పో ఒక మంచి వేదిక అని పేర్కొన్నారు. ఎక్స్‌పో కన్వీనర్ గోవిందరాజు మాట్లాడుతూ నగరాభివృద్ధి, పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా ఇక్కడ అపార్ట్‌మెంట్‌లు, విల్లాలు, ఓపెన్ ప్లాట్లు , వాణిజ్య స్థలాలకు సంబంధించి మొత్తం 71 స్టాల్స్‌ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ ప్రదర్శనలో ప్రత్యేక రాయితీలు, స్పాట్ బుక్కింగ్ సౌకర్యం, సులభతరమైన చెల్లింపు పద్ధతులు అందుబాటులో ఉన్నాయని వివరించారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు పట్టాభిరామ్, ఎస్‌బీఐ విశాఖ డీజీఎం రాహుల్ సాంకృత్య, క్రెడాయ్ కార్యదర్శి వి. శ్రీను తదితరులు పాల్గొన్నారు.


