పదవీ విరమణ చేసిన రోజునే పెన్షన్ ప్రయోజనాలు
బీచ్‌రోడ్డు: ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ చేసిన వెంటనే వారికి రావాల్సిన పెన్షన్ ప్రయోజనాలను అందించాలనే దృఢ సంకల్పంతో ఉన్నామని రాష్ట్ర ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ ఎస్.శాంతిప్రియ స్పష్టం చేశారు. శుక్రవారం వీఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరీనాలో నిర్వహించిన పెన్షన్ అదాలత్‌లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ నెల నుంచే కొన్ని విభాగాల ఉద్యోగులకు ఎలక్ట్రానిక్ పెన్షన్ చెల్లింపు ఆర్డర్ పత్రాలను ఆన్‌లైన్ ద్వారా అందజేస్తామని, అలాగే ఆన్‌లైన్ దరఖాస్తు విధానంపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక వీడియోను అందుబాటులోకి తెచ్చామని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ పెన్షన్ అదాలత్‌లను నిర్వహిస్తున్నామని, డీడీవోల సమక్షంలో పెన్షనర్ల సమస్యలను నేరుగా విని తక్షణ పరిష్కారానికి ఆదేశాలు జారీ చేస్తున్నామని తెలిపారు. పెన్షనర్లు తమ డాక్యుమెంటేషన్‌ను స్వయంగా ఆన్‌లైన్‌లో చేసుకునే సౌకర్యం కల్పించామని, ఆర్బీపీఎస్ ప్రక్రియ ద్వారా ఏజీ కార్యాలయానికి చేరిన పత్రాలను త్వరగా పరిశీలించి బెనిఫిట్స్ అందజేస్తున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె పెన్షన్ గ్రీవెన్స్ రెడ్రస్సల్ పేజీని ప్రారంభించి, దీని ద్వారా పెన్షన్‌దారులు తమ వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకోవచ్చని సూచించారు. అనంతరం ఖజానా శాఖ డైరెక్టర్ ఎస్.మోహనరావు మాట్లాడుతూ గతంలో పెన్షన్ ప్రయోజనాల మంజూరులో కొంత జాప్యం జరిగేదని, అయితే డిజిటలైజేషన్ వల్ల ఇప్పుడు పనులు వేగవంతమయ్యాయని తెలిపారు. పెన్షన్ దారులు ఈ అదాలత్‌లను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.


