డ్రెడ్జింగ్ కార్పొరేషన్‌కు ఎండీ కావలెను!
సాక్షి, విశాఖపట్నం : అక్రమాల పుట్టగా మారిన డ్రెడ్జింగ్ కార్పొరేషన్‌ను గాడిలో పెట్టేందుకు మరోసారి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. డీసీఐ కోసం కొత్త ఎండీ నియామకానికి సంస్థ చైర్మన్, విశాఖపట్నం పోర్టు చైర్మన్ డా.అంగముత్తు శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేశారు. సీఎండీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న దుర్గేష్‌కుమార్ దూబే బదిలీ అయిన తర్వాత.. గతంలో పనిచేసిన వ్యక్తికి ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించారు. సదరు అధికారి విద్యార్హతలకు సంబంధించిన నకిలీ ధృవపత్రాలతో అధికారం సంపాదించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయన వ్యవహారంపై ‘సాక్షి’లో ‘డ్రెడ్జింగ్‌కు మళ్లీ నకిలీ బాస్.!’, ‘గోదావరి కోసం అంత తొందరేంటో.?’ శీర్షికలతో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. దీనిపై పోర్టు ఇన్‌చార్జ్ చైర్మన్ డా.అంగముత్తు విచారణ చేపట్టారు. సమగ్ర విచారణ తర్వాత ఎండీ పోస్టుకు సదరు అధికారి అనర్హులని గుర్తించి.. కొత్త ఎండీ నియామకం తప్పనిసరి అని భావించారు. దీనిపై బోర్డులో చర్చించిన అనంతరం తాజాగా నోటిఫికేషన్ జారీ చేశారు. వచ్చే ఏడాది జనవరి 8 వరకూ దరఖాస్తులను ఆహ్వానించారు. జనవరి నెలాఖరు నాటికి డీసీఐకి కొత్త ఎండీ వచ్చే అవకాశం ఉంది.


