ఐఐఎంవీలో ఇండియా ఫైనాన్స్ కాన్ఫరెన్స్
సదస్సులో పాల్గొన్న ఫైనాన్స్ రంగ నిపుణులు
తగరపువలస: గంభీరంలోని ఐఐఎం విశాఖ వేదికగా జరుగుతున్న 14వ ఇండియా ఫైనాన్స్ కాన్ఫరెన్స్ రెండో రోజు కార్యక్రమాలు శుక్రవారం ఉత్సాహంగా జరిగాయి. ఐఐఎం అహ్మదాబాద్, బెంగళూరు, కలకత్తా సంస్థల భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న ఈ అంతర్జాతీయ సదస్సులో దేశవిదేశాలకు చెందిన పరిశోధకులు, విద్యావేత్తలు, పరిశ్రమ నిపుణులు పాల్గొన్నారు. మొత్తం 400 పరిశోధన పత్రాలను సమీక్షించగా.. ఫైనాన్స్, అకౌంటింగ్, రిస్క్ మేనేజ్‌మెంట్ వంటి కీలక అంశాలపై 135 పత్రాలను ప్రదర్శనకు ఎంపిక చేశారు. ఎమోరీ, జార్జ్‌టౌన్, సెయింట్ లూయిస్ వంటి అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లు తరుణ్ చోర్డియా, రీనా అగర్వాల్, బిదిషా చక్రబర్తి తమ ప్రసంగాల ద్వారా ఫైనాన్షియల్ మార్కెట్లలోని సరికొత్త పోకడలను వివరించారు. ఐఐఎంవీ డీన్ విజయభాస్కర్, సదస్సు కన్వీనర్ మోనికా దోచక్, కో కన్వీనర్ కావేరి కృష్ణన్, ఇండియా ఫైనాన్స్ అసోషియేషన్ వైస్ ప్రెసిడెంట్ శంకర్షన్ బసు పాల్గొన్నారు.


