పోలీస్ కమిషనర్‌కు ప్రతిష్టాత్మక అవార్డు
డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా నుంచి అవార్డు అందుకుంటున్న సీపీ డాక్టర్ శంఖబ్రత బాగ్చి
అల్లిపురం: నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చీ ప్రతిష్టాత్మక ‘ఏబీసీడీ’ (అవార్డ్ ఫర్ బెస్ట్ క్రైం డిటెక్షన్) పురస్కారాన్ని అందుకున్నారు. అమరావతిలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా ఈ అవార్డును అందజేశారు. సంచలనం సృష్టించిన లోన్ యాప్ ఫ్రాడ్ కేసులో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, 19 మంది అరెస్టు చేయడంలో చూపిన ప్రతిభకు గుర్తింపుగా సీపీకి ఈ గౌరవం దక్కింది. కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన సైబర్ క్రైమ్ సిబ్బందిని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వం సత్కరించింది. సీపీ బాగ్చీతో పాటు సైబర్ క్రైమ్ ఇన్‌స్పెక్టర్లు కె. భవానీప్రసాద్, బీ.ఎం.డీ. ప్రసాద్, సబ్ ఇన్‌స్పెక్టర్ ఈ. మహేశ్వరరావు, కానిస్టేబుళ్లు టి. సన్యాసినాయుడు, బి. చంద్రశేఖర్‌లు డీజీపీ చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు.


