కోటి సంతకాల ఉద్యమ ర్యాలీకి తరలిరండి
సాక్షి, విశాఖపట్నం: ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ చేపట్టిన ‘కోటి సంతకాల సేకరణ’ ప్రజా ఉద్యమం విజయవంతమైందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు తెలిపారు. రెండు నెలలుగా ప్రజల నుంచి అద్భుతమైన స్పందన లభించిందని, లక్ష్యాన్ని మించి కోటి సంతకాలను సేకరించామని ఆయన పేర్కొన్నారు. మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సేకరించిన ఈ కోటి సంతకాల పత్రాలను సోమవారం జిల్లా పార్టీ కార్యాలయం నుంచి తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయానికి తరలించనున్నామన్నారు. ఈ సందర్భంగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సంతకాల పత్రాల ప్రదర్శన, అనంతరం అక్కడి నుంచి ర్యాలీగా వాటిని తరలిస్తామని తెలిపారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు వైఎస్సార్‌సీపీ ఉద్యమాన్ని కొనసాగిస్తుందని కేకే రాజు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు, రాజ్యసభ్యుడు గొల్ల బాబురావు, పార్లమెంట్ పరిశీలకులు కె.బాబూరావు, ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, పండుల రవీంద్రబాబు, కుంబా రవిబాబు, సమన్వయకర్తలు వాసుపల్లి గణేష్‌కుమార్, మళ్ల విజయప్రసాద్, మొల్లి అప్పారావు, తిప్పల దేవన్‌రెడ్డి హాజరుకానున్నారు. ర్యాలీ జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి సీఎంఆర్ సెంట్రల్ జంక్షన్ వరకు సాగుతుందన్నారు. ర్యాలీలో ప్రజలు, యువత, విద్యార్థులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.


