మెడ్‌టెక్‌తో ఆస్ట్రేలియా వర్సిటీ ఒప్పందం
పెదగంట్యాడ: మెడ్‌టెక్ జోన్(ఏఎంటీజెడ్)తో పాటు రాష్ట్రంలోని పలు సంస్థలతో యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా శుక్రవారం కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం ద్వారా విశాఖను ఇండో–పసిఫిక్ ప్రాంతంలో హెల్త్ టెక్నాలజీ, రక్షణ పరిశోధనలకు ప్రధాన కేంద్రంగా మార్చనున్నారు. ఒప్పందంలో భాగంగా మెడ్‌టెక్ ఇన్నోవేషన్, క్లినికల్ ట్రయల్స్, గ్లోబల్ హెల్త్ టెక్నాలజీలో సంయుక్త పరిశోధనలు జరుగుతాయి. సముద్ర గర్భంలో నిఘా, యాంటీ సబ్‌మైరెన్ వార్‌ఫేర్, బ్లూ ఎకానమీ వంటి అంశాల్లో ఇరు సంస్థలు కలిసి పనిచేస్తాయి. విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి ఇంటర్న్‌షిప్‌లు, పరిశోధన అవకాశాలు లభిస్తాయి. భారత్–ఆస్ట్రేలియా సంబంధాలను బలోపేతం చేస్తూ, తూర్పు భారత మహాసముద్రంలో ప్రాంతీయ భద్రతను పెంచడం ఈ ఒప్పంద లక్ష్యమని మెడ్‌టెక్ జోన్ సీఈవో జితేంద్ర శర్మ తెలిపారు. ఈ మేరకు యూడబ్ల్యూఏ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ అమిత్ చక్మా, వర్సిటీ ప్రతినిధులతో కలిసి ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.


