విశాఖ పోర్ట్‌లో నేపాల్, రష్యా బృందాల పర్యటన
విశాఖ సిటీ: నేపాల్, రష్యాలకు చెందిన ఉన్నత స్థాయి వ్యాపార ప్రతినిధి బృందాలు శనివారం విశాఖపట్నం పోర్ట్‌ను సందర్శించాయి. నేపాల్ ప్రతినిధి బృందానికి ఆ దేశ పరిశ్రమ, వాణిజ్య, సరఫరాల మంత్రి అనిల్ కుమార్ సిన్హా నాయకత్వం వహించారు. ఆయనతో పాటు నేపాల్ కేంద్ర పరిశ్రమలు, వాణిజ్యం, సరఫరాల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి బిపిన్ ఆచార్య, అండర్ సెక్రటరీ తరకరాజ్ భట్ట కూడా పాల్గొన్నారు. అలాగే, రష్యా నుంచి 11 మంది సభ్యులున్న వ్యాపార ప్రతినిధి బృందం కూడా పోర్ట్‌లో పర్యటించింది. ఈ అంతర్జాతీయ బృందాలకు పోర్ట్ అధికారులు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పోర్ట్‌లో అందుబాటులో ఉన్న ఆధునిక మౌలిక సదుపాయాలు, సరకు రవాణా సామర్థ్యం, జరుగుతున్న ఆధునికీకరణ– యాంత్రీకరణ పనులు, కవర్డ్ స్టోరేజ్ సౌకర్యాలు, సోలార్ పవర్ వినియోగం, పారిశ్రామిక అవసరాల కోసం వినియోగించే ఎస్‌టీపీ ద్వారా నీటి రీసైక్లింగ్ వంటి విధానాలను వివరించారు. విశాఖ పోర్ట్ ద్వారా జరుగుతున్న దిగుమతి–ఎగుమతి కార్యకలాపాలు, వ్యాపార అభివృద్ధికి ఉన్న పెట్టుబడి అవకాశాలు, పరస్పర సహకార మార్గాలపై ఇరు వర్గాల ప్రతినిధులు చర్చలు జరిపారు.


