భూ దందాలో పవర్ ప్లే!
విద్యుత్ కనెక్షన్ వ్యవహారంలో తలదూర్చిన వైనం
మధ్యవర్తిత్వం వహించినట్టు ఆరోపణలు
వివాదం సద్దుమణగకుండా ఉండేందుకు ప్రయత్నం
ఇప్పటికే తహసీల్దార్, సీఐలపై వేటు
విద్యుత్ శాఖ సీఐపైనా సాగుతున్న విచారణ?
రాజకీయంగా రంగు పులుముకున్న అచ్యుతాపురం భూ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. సివిల్
వివాదాన్ని క్రిమినల్ కేసుగా మార్చగా.. ఇప్పుడు కరెంట్ కనెక్షన్ వ్యవహారంలో ఏకంగా విద్యుత్ శాఖ సీఐ
జోక్యం చేసుకున్నారన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే తహసీల్దార్, సీఐపై బదిలీ వేటు
పడగా.. ఇప్పుడు ఈ ‘పవర్’ఫుల్ అధికారి ప్రమేయంపై విచారణ జరుగుతున్నట్లు తెలుస్తోంది.
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం:
జనసేనలో అంతర్గతంగా తీవ్ర వివాదం రేపు తున్న అచ్యుతాపురం భూ వివాదంలో రోజుకో కొత్త పేరు తెర మీదకు వస్తోంది. ఈ వివాదంలో అక్కడి స్థానిక ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సన్నిహితుడు సురేష్‌తో పాటు తహసీల్దార్, సీఐలు తలదూర్చినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే తహసీల్దార్, సీఐలపై బదిలీ వేటు పడగా.. ఈ వ్యవహారంలో విద్యుత్ శాఖకు చెందిన ఓ సీఐ కూ డా తలదూర్చినట్టు విమర్శలు గుప్పుమంటున్నా యి. ఒకవైపు కోర్టులో కేసు ఉండగానే.. విద్యుత్ కనెక్షన్ మంజూరు కోసం దరఖాస్తు వచ్చిన వెంటనే సీఐ జోక్యం చేసుకున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. వాస్తవానికి అచ్యుతాపురం మండలం దుప్పితూరు గ్రామం, భోగాపురం రెవెన్యూ పరిధిలోని 40/2, 30, 31, 39, 461/2, 5, 7, 477, 488, 490/1, 490/2, 52, 54, 56, 60/2, 103, 112, 113, 114/3 సర్వే నంబర్లలోని 35 ఎకరాలకుపైగా భూ వ్యవహారంలో 1993 నుంచి పీఆర్‌ఎస్ నాయుడు, పైలా వెంకటస్వామి మధ్య వివాదం నడుస్తోంది. అయితే ఈ భూమిలోకి ఎవరూ వెళ్లకుండా ఉండేందుకు కోర్టు నుంచి గతంలో ఆదేశాలు ఉన్నాయి. అయినప్పటికీ విద్యుత్ కనెక్షన్ మంజూరు చేయాలంటూ పీఆర్‌ఎస్ నాయుడు దరఖాస్తు చేసుకోగా.. సీఐ జోక్యం చేసుకున్నట్లు తెలుస్తోంది.
145 ప్రొసీడింగ్స్ ఉండగానే..
అచ్యుతాపురం మండలం దుప్పితూరు, భోగాపురం రెవెన్యూ పరిధిలోని 35 ఎకరాలకుపైగా భూ వ్యవహారంలో ఇరువురి మధ్య వివాదం నెలకొని ఉంది. ఈ వివాదాన్ని స్థానిక ఎమ్మెల్యే తనకు అనుకూలంగా మార్చుకుని వివాదాన్ని పరిష్కరించే పేరిట భారీగా నగదు డిమాండ్ చేశారనే విమర్శలున్నాయి. అయితే, ఈ వివాదం కోర్టులో నడుస్తుండగానే.. విద్యుత్ కనెక్షన్ కావాలంటూ పీఆర్‌ఎస్ నాయుడు దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తు పరిశీలనలో ఉండగా.. సీఐ మరో పార్టీగా ఉన్న వెంకటస్వామి తరపున కనెక్షన్ ఇవ్వకుండా చూసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. అయితే, వివాదంలో ఉన్న భూమి కావడంతో కనెక్షన్ ఇచ్చేందుకు అధికారులు నిరాకరించినట్టు సమాచారం. మరోవైపు కోర్టు వివాదం సద్దుమణిగిన తర్వాత, అనుకూల తీర్పుతో విద్యుత్ కనెక్షన్ కోసం మరోసారి వ్యవహారం నడిపినట్టు తెలుస్తోంది. ఇంతలోగా భూమిలోనికి ప్రవేశించారనే కారణంగా, స్థానిక ఎమ్మెల్యే ఒత్తిడితో తహసీల్దార్ 145 ప్రొసీడింగ్స్ జారీచేశారు. తద్వారా వ్యవహారాన్ని క్రిమినల్ కేసుగా మార్చారు. ఈ నేపథ్యంలో తహసీల్దార్ నుంచి 145 ప్రొసీడింగ్స్ ఉన్నందున విద్యుత్ కనెక్షన్ ఇవ్వవద్దంటూ మరోసారి సదరు సీఐ చక్రం తిప్పినట్టు ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు విద్యుత్ శాఖ సీఐ కొద్ది మంది కూటమి నేతలను కూడా కలిసి పైరవీ చేసేందుకు ప్రయత్నించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తహసీల్దార్, సీఐపై వేటు పడగా.. విద్యుత్ శాఖ సీఐ పాత్రపై కూడా విచారణ సాగుతున్నట్టు సమాచారం.
ఇదీ అసలు వివాదం
అచ్యుతాపురం మండలం దుప్పితూరు గ్రామం, భోగాపురం రెవెన్యూ పరిధిలోని 40/2, 30, 31, 39, 461/2, 5, 7, 477, 488, 490/1, 490/2, 52, 54, 56, 60/2, 103, 112, 113, 114/3 సర్వే నంబర్లలోని 35 ఎకరాలకుపైగా భూ వ్యవహారంలో 1993 నుంచి పీఆర్‌ఎస్ నాయుడు, పైలా వెంకటస్వామి మధ్య వివాదం నడుస్తోంది. ఈ భూమిలోకి ఎవరూ వెళ్లకుండా ఉండేందుకు కోర్టు నుంచి గతంలో ఆదేశాలు ఉన్నాయి. అనంతరం జరిగిన కోర్టు ప్రొసీడింగ్స్‌లో, పీఆర్‌ఎస్ నాయుడుకు అనుకూలంగా కోర్టు తీర్పు వచ్చింది. ఈ వివాదం నడుస్తున్న సమయంలోనే పీఆర్‌ఎస్ నాయుడుకు అనుకూలంగా వ్యవహరించేందుకు ఎమ్మెల్యే భారీగా డబ్బులు డిమాండ్ చేయడమే కాకుండా రూ.50 లక్షలు అడ్వాన్స్‌గా కూడా తీసుకున్నారనే ఆరోపణలున్నాయి. అయితే, కోర్టు తీర్పు వచ్చిన నేపథ్యంలో ఇరువురి మధ్య రాజీ జరిగినట్టు తెలుస్తోంది. దీంతో నేరుగా భూమిలోకి పీఆర్‌ఎస్ నాయుడు ప్రవేశించారు. తనతో సంబంధం లేకుండా నేరుగా ఇరువురు రాజీపడి సమస్యను పరిష్కరించుకోవడంపై కినుక వహించిన ఎమ్మెల్యే స్థానిక తహసీల్దార్‌తో పాటు సీఐపై ఒత్తిడి తెచ్చి, సివిల్ వివాదాన్ని క్రిమినల్ వివాదంగా మార్చే ప్రయత్నం చేశారనే ఆరోపణలున్నాయి. అయితే అప్పటికే ఈ వివాదంలో నాయుడుకు అనుకూలంగా పవన్ సన్నిహితుడైన సురేష్ అనే వ్యక్తి రంగంలోకి దిగి వివాదాన్ని పరిష్కరించారనే వార్తలు గుప్పుమంటున్నాయి.
అచ్యుతాపురం భూ వివాదంలో విద్యుత్ శాఖ సీఐ


