మమ అనిపించేశారు!
విద్యార్థులతోనే సాగిన రెండో రోజు సదస్సు
గీతం విద్యార్థులతో నిండిపోయిన ప్రధాన వేదిక ప్రాంగణం
బీ టూ బీ హాల్స్‌లో చివరి రోజునా అదే దుస్థితి
విద్యార్థులను తామే తీసుకొచ్చామని ఒప్పుకున్న సీఎం చంద్రబాబు
సాక్షి, విశాఖపట్నం: ప్రపంచ నలుమూలల నుంచి పారిశ్రామికవేత్తలు.. వాణిజ్య ప్రతినిధులతో కళకళలాడుతుందనుకున్న రెండు రోజుల భాగస్వామ్య సదస్సు వెలవెలబోయింది. 2023లో నిర్వహించిన జీఐఎస్‌కు అంబానీ, అదానీ వంటి ప్రముఖుల రాకతో రెట్టింపైన విశాఖ ఖ్యాతి.. ఇప్పుడు నిర్వహించిన భాగస్వామ్య సదస్సు అపఖ్యాతి పాలైనట్లుగా కనిపించింది. జీఐఎస్–2023తో ‘ఇది సార్.. వైజాగ్ బ్రాండ్’ అని దశదిశలా చాటిచెబితే.. ఈ సారి ‘ఏదో సార్.. అలా కానిచ్చేశాం’ అన్నట్లుగా సాగింది. ప్రముఖ పారిశ్రామికవేత్తలు కనిపించలేదు. వాణిజ్య ప్రతినిధులు వస్తారని అనుకుంటే.. విద్యార్థులే దర్శనమిచ్చారు. మొత్తానికి రెండు రోజుల పాటు నిర్వహించిన భాగస్వామ్య సదస్సును చంద్రబాబు ప్రభుత్వం మమ అనిపించేసింది. విద్యార్థులను తామే తీసుకొచ్చినట్లు చంద్రబాబే స్వయంగా ఒప్పుకోవడం గమనార్హం.
చోదక శక్తి కేంద్రాలుగా మారుతున్న ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల జాబితాలో విశాఖపట్నం అగ్రభాగంలో ఉంది. 2023లో అప్పటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రెండు రోజుల పాటు నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ సూపర్ సక్సెస్ అయ్యింది. ప్రణాళికాబద్ధంగా నిర్మితమైన నగరంగా విశాఖకు ఆ సమ్మిట్ నిర్వహణతో అంతర్జాతీయ గుర్తింపు దక్కింది. 2016, 2017, 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వ మూడుమార్లు పెట్టుబడుల సదస్సులు నిర్వహించినా రాని ఇమేజ్.. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మొదటిసారి ఏర్పాటు చేసిన జీఐఎస్‌తో వైజాగ్ పేరు ఖండాంతరాలు దాటింది. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బ్రాండ్ అంబాసిడర్‌గా నిర్వహించిన సమ్మిట్‌కు దేశ విదేశాలకు చెందిన దిగ్గజ పారిశ్రామికవేత్తలు, ప్రతినిధులు హాజరై.. విశాఖ నగర వైభవానికి వావ్ చెప్పారు. ఆ వైబ్ నిన్న మొన్నటి వరకు విశాఖలో కొనసాగింది. కానీ చంద్రబాబు ప్రభుత్వం నిర్వహించిన భాగస్వామ్య సదస్సుతో ఆ ప్రతిష్ట.. అప్రతిష్టపాలైంది. సదస్సు ప్రచారంపై ప్రభుత్వం పెట్టి శ్రద్ధ.. విజయవంతం చేయడంలో విఫలమైందని వాణిజ్య ప్రతినిధులే పెదవి విరిచారు.
చివరి రోజునా కనిపించని డెలిగేట్స్
అనేక దేశాల నుంచి వేల మంది డెలిగేట్స్ వస్తున్నారంటూ ప్రభుత్వం ప్రచారం చేసింది. కానీ.. ప్రధాన వేదిక మొదలుకొని.. ప్లీనరీ సెషన్ల వరకూ డెలిగేట్లను వేళ్లపై లెక్కపెట్టుకునేంత మంది మాత్రమే కనిపించారు. తొలిరోజున ఉపరాష్ట్రపతి, కేంద్ర మంత్రి సదస్సులో ఉన్నప్పుడే వేదిక ఖాళీగా కనిపించింది. దీంతో రెండో రోజు హాల్స్ అన్నీ నిండిపోవాలని చంద్రబాబు హుకుం జారీ చేసినట్లు తెలిసింది. దీంతో రాత్రికి రాత్రి ఏయూ విద్యార్థులనే డెలిగేట్స్‌గా రిజిస్ట్రేషన్ చేయించేశారు. ప్రధాన వేదికై న ఏపీ పెవిలియన్ హాల్ నం.5 మొత్తం గీతం విద్యార్థుల కోసం కేటాయించేశారు. హాల్స్ ఫుల్ ప్యాక్ అని భావించిన ప్రభుత్వానికి.. చివరికి చుక్కెదురైంది. ఉన్నంతలో విద్యార్థులే కనిపించడంతో.. చేసేదిలేక చంద్రబాబు నిజం వెల్లగక్కారు. ముగింపు సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో 500 మంది విద్యార్థులను సదస్సుకు తామే తీసుకొచ్చామంటూ అంగీకరించారు.
జనాలు లేక సెషన్లు రద్దు
బిజినెస్ టూ బిజినెస్ హాల్స్ కూడా వాణిజ్య ప్రతినిధులు లేక ఖాళీగా దర్శనమిచ్చాయి. దీంతో వేలకు వేల రూపాయిలు పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యాపారులు.. ఉసూరుమంటూ వెనుదిరిగారు. 700కి పైగా బీ టూ బీ సదస్సులు జరిగాయని ప్రభుత్వం చెబుతుంటే.. పట్టుమని వంద కూడా నిర్వహించలేక చేతులెత్తేశారంటూ బిజినెస్ డెలిగేట్స్ విమర్శిస్తున్నారు. ఇక శనివారం 5 సెషన్లు నిర్వహించాల్సి ఉండగా.. ఎవరూ కనిపించకపోవడంతో రెండు సెషన్లతోనే సరిపెట్టినట్లు కొందరు వాణిజ్యవేత్తలు చెబుతున్నారు.
భోజనాల కోసం పాట్లు : విద్యార్థులతో రిజిస్ట్రేషన్ చేయించేసిన నిర్వాహకులు.. దానికి తగ్గట్లుగా ఏర్పా ట్లు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. లంచ్ సమయానికి డెలిగేట్స్‌గా రిజిస్టర్ చేసుకున్న విద్యార్థులు ఒక్కసారిగా రావడంతో.. భోజన హాల్స్ నిండిపోయాయి. సెషన్ ముగించుకుని లంచ్ హాల్‌కు వచ్చి న డెలిగేట్స్.. అక్కడ వాతావరణం చూసి విస్తుపోయారు. భోజనాలకు వెళ్లే దారిలేక.. ఆకలితోనే వెనుదిరిగామని కొందరు వ్యాపారవేత్తలు ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తానికి అంకెల గారడీతో లక్షల కోట్లు పెట్టుబడులు, లక్షలాది ఉద్యోగాలు రాబోతున్నాయని చంద్రబాబు ప్రకటించి సదస్సును ముగించేశారు.
అంకెల్లో పెట్టుబడులు ఇలా..
తొలి రోజున రూ. 3,49,476 కోట్లు, శనివారం రూ.48,430 కోట్ల మేర ఎంవోయూలు కుదిరినట్లు ప్రభుత్వం ప్రకటించింది. అదే విధంగా సదస్సుకు ముందు రోజు రూ.3,65,304 కోట్లు పెట్టుబడులు వచ్చినట్లు వెల్లడించారు. ఆయా ఒప్పందాల ద్వారా 12 రంగాలకు పెట్టుబడులు వచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది. పెట్టుబడుల్లో టాప్–3లో ఇంధన రంగం, పరిశ్రమలు, మౌలిక వసతుల రంగాలు నిలిచాయి. మొత్తంగా రూ.13.25 లక్షల కోట్ల మేర పెట్టుబడుల్లో అధిక భాగం ఇంధన రంగానికి వచ్చినట్లు తెలిపింది. ఈ రంగంలో రూ. 5,33,351 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఆ తర్వాత పరిశ్రమల రంగానికి రూ. 2,80,384 కోట్లు, మౌలిక వసతుల రంగానికి రూ. 2,01,758 కోట్లు వచ్చాయని అధికారులు తెలిపారు. ఉద్యోగాల కల్పనకు సంబంధించి టాప్–3లో పరిశ్రమలు, మౌలిక వసతులు, ఐటీ, ఈ అండ్ సీ రంగాలున్నాయి.
బహుమతి అందిస్తున్న సీఎం చంద్రబాబు
వాణిజ్య ప్రతినిధి.. స్కూటీలో వచ్చారు!
మమ అనిపించేశారు!
మమ అనిపించేశారు!


