డిసెంబర్ 13న మెగా లోక్ అదాలత్
విశాఖ లీగల్: జాతీయ లోక్ అదాలత్ ఆదేశాల మేరకు డిసెంబర్ 13న మెగా లోక్ అదాలత్‌ను నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ చిన్నంశెట్టి రాజు తెలిపారు. జిల్లా కోర్టులో శనివారం ఉమ్మడి విశాఖ జిల్లాలోని న్యాయమూర్తులందరితో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ.. డిసెంబర్ 13న జరిగే జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. విశాఖపట్నం, గాజువాక, అనకాపల్లి, యలమంచిలి, చింతపల్లి, పాడేరు, అరకు, మాడుగుల, చోడవరం ప్రాంతాల్లోని అన్ని న్యాయస్థానాల్లో లోక్ అదాలత్ జరుగుతుందని స్పష్టం చేశారు. రాజీ అయ్యే అవకాశమున్న అన్ని క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు, బ్యాంక్, బీమా, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు సంబంధించిన అన్ని కేసులను ఈ అదాలత్‌లో పరిశీలించి, షరిష్కరించాలన్నారు. మరిన్ని వివరాల కోసం తమను సంప్రదించాలని న్యాయ సేవా ప్రాధికార సంస్థ కార్యదర్శి ఆర్. సన్యాసినాయుడు సూచించారు.


