పోలియో రహిత సమాజమే మన లక్ష్యం
ఏయూక్యాంపస్: పోలియో రహిత సమాజం లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి పిలుపునిచ్చారు. విశాఖపట్నం రోటరీ క్లబ్స్ ఆధ్వర్యంలో పోలియో నిర్మూలనపై వైఎంసీఏ వద్ద ఆదివారం ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వ్యాక్సిన్ ద్వారా పోలియోను పూర్తిగా నిర్మూలించడం సాధ్యమవుతుందన్నారు. గతంలో వ్యాక్సినేషన్ ద్వారా మశూచిని నిర్మూలించగలిగామని గుర్తు చేస్తూ.. అదే విధంగా పోలియో నిర్మూలనకు కూడా కృషి చేయాలని సూచించారు. రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ 3020 గవర్నర్ డాక్టర్ కల్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా పోలియో కేసులు కొద్ది సంఖ్యలో ఉన్నప్పటికీ.. వాటిని పూర్తిగా రూపుమాపేందుకు నిరంతర పర్యవేక్షణ, వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగించాలని కోరారు. పోలియో వ్యాక్సినేషన్ కార్యక్రమాల కోసం రోటరీ సభ్యులు ఉదారంగా విరాళాలు అందించాలని, ముఖ్యంగా పేద దేశాలకు వ్యాక్సిన్ సరఫరా చేయడం అత్యవసరమని సూచించారు. డీజీఎన్‌డీ శోభన్ ప్రకాష్, సామ్ మెవ్వ, పీజీడీ పార్థసారథి, డిస్ట్రిక్ట్ పోలియో చైర్ రాంబాబు, రీజినల్ పోలియో చైర్ కాళీప్రసాద్ సహా నగరంలోని 15 రోటరీ క్లబ్‌లకు చెందిన సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్లాష్‌మాబ్ అందరినీ ఆకట్టుకుంది.
సీపీ శంఖబ్రత బాగ్చి


