నిందితుడిని పట్టించిన ‘గాండీవ’ యాప్
మధురవాడ: కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ‘గాండీవ’ యాప్ సహాయంతో విశాఖ నార్త్ జోన్ పోలీసులు అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన కెమెరా చోరీ కేసును ఛేదించారు. ఈ యాప్ పోలీసులకు బ్రహ్మాస్త్రంగా మారిందని నార్త్ జోన్ ఇన్‌చార్జి క్రైం ఏసీపీ అన్నెపు నరసింహమూర్తి ఆదివారం మీడియాకు తెలిపారు. పీఎంపాలెం పరిధిలోని వైఎస్ రాజశేఖర రెడ్డి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఆంధ్రా ప్రీమియం లీగ్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా సుమారు రూ. 3 లక్షలు విలువ చేసే సోనీ కెమెరా, లెన్స్, బ్యాటరీ చోరీకి గురయ్యాయి. ఆగస్టు 23న జరిగిన ఈ చోరీపై ద్వారకానగర్‌కు చెందిన బాధితుడు కోమరెడ్డి ఫణి చైతన్య పీఎంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరీ సొత్తు విలువ తక్కువే అయినప్పటికీ, అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన ఘటన కావడంతో పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకున్నారు. పీఎంపాలెం క్రైం ఎస్‌ఐ రంభ శ్రీనివాస్ ఆధ్వర్యంలో రెండు విచారణ బృందాలను ఏర్పాటు చేశారు.
సాంకేతికతతో సాయంతో..
కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ‘గాండీవ’ యాప్ ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కేసును విచారించారు. దొంగతనం జరిగిన సమయంలో కెమెరాకు దగ్గరగా వచ్చిన వ్యక్తుల ఇమేజ్‌లను సీసీ కెమెరాల ద్వారా సేకరించి యాప్‌లో అప్‌లోడ్ చేశారు. ఈ విశ్లేషణ ఆధారంగా కర్ణాటక మహాబూబే కాలనీకి చెందిన మహమ్మద్ ముస్తాఖ్ హుస్సేన్‌పై అనుమానం రావడంతో విచారణ ప్రారంభించారు. అనుమానితుడి ఇమేజ్‌లకు చెందిన ఫోన్ కాల్ డేటాను మ్యాచ్ చేయగా, సెల్ సిగ్నల్ ఆధారంగా అతను భోగాపురం ఎయిర్‌పోర్ట్, కర్ణాటక ప్రాంతాల్లో సంచరించినట్టు గుర్తించారు. నిందితుడు భోగాపురం ఎయిర్‌పోర్ట్ నిర్మాణ పనులకు కాంట్రాక్ట్ లేబర్‌ను సప్లై చేసి, పనులు ముగిసిన తర్వాత కర్ణాటకకు వెళ్లిపోయినట్టు తేలింది. కొద్దికాలంగా నిందితుడి సెల్ సిగ్నల్‌ను ట్రేస్ చేస్తూ ఫాలో అవుతున్న పోలీసులు.. ఆదివారం పీఎంపాలెం క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌కు ముస్తాఖ్ హుస్సేన్ వచ్చినట్టు గుర్తించి వలపన్ని పట్టుకున్నారు. కేసు ఛేదనలో ప్రతిభ కనబరిచిన విశాఖ నార్త్ జోన్ సీఐ బీఎస్‌ఎస్ ప్రకాశ్, ఎస్‌ఐ రంభ శ్రీనివాస్, ఆనందపురం ఏఎస్‌ఐ గోవిందరాజు, పీఎంపాలెం పోలీసు స్టేషన్ సిబ్బంది రవికుమార్, చంద్రశేఖర్, నాగేశ్వరరావులను ఏసీపీ నరసింహమూర్తి అభినందించారు. ఉత్తమ ప్రతిభ చూపిన వీరు సీపీ రివార్డ్‌కు ఎంపికై నట్లు ఏసీపీ ప్రకటించారు.


