20 ఐరన్ టాబ్లెట్లు మింగిన చిన్నారికి పునర్జన్మ
7 వారాల పాటు చికిత్స అందించిన వైద్యులు
మహారాణిపేట: 20 ఐరన్ టాబ్లెట్లు మింగి ప్రాణాపాయ స్థితికి చేరిన రెండేళ్ల చిన్నారికి జగదాంబ జంక్షన్‌లోని మెడికవర్ హాస్పిటల్ వైద్యు లు విజయవంతంగా చికిత్స అందించి ప్రాణాలు కాపాడారు. చిన్నారి ఆసుపత్రికి వచ్చే సరికే శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది పడుతుండటంతో కన్సల్టెంట్ పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్ డాక్టర్ సాయి సునీల్ కిశోర్ నేతృత్వంలోని బృందం.. వెంటనే చికిత్స ప్రారంభించింది. ముందుగా ‘కీలేషన్ థెరపీ’ద్వారా శరీరంలోని అధిక ఐరన్‌ను తొలగించారు. అయితే చికిత్స సమయంలో చిన్నారికి అనేక కొత్త సమస్యలు తలెత్తాయి. మొదటి వారంలో కాలేయం దెబ్బతిన్నా, వైద్యుల సకాల స్పందనతో అది తిరిగి కోలుకుంది. అనంతరం రెండు ఊపిరితిత్తుల్లో గాలి లీక్ (బైలాటరల్ న్యుమోథోరాక్స్) కావడం, తీవ్రమైన సెప్సిస్ సోకడం పరిస్థితిని మరింత క్లిష్టతరం చేశాయి. వైద్య బృందం వెంటిలేటర్ సాయంతో పాటు పునరావృతమయ్యే గాలి లీక్ సమస్యకు ‘బ్లడ్ ప్యాచ్ ప్లూరోడెసిస్’ అనే నూతన చికిత్సను, సెప్సిస్ కోసం ఐవీఐజీ థెరపీని అందించింది. ఏడు వారాల పాటు ఐసీయూలో నిరంతర పర్యవేక్షణ, అధునాతన చికిత్సల అనంతరం చిన్నారి కాలేయం, ఊపిరితిత్తులు పూర్తిగా కోలుకున్నాయి. ప్రస్తుతం చిన్నారి సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయినట్లు డాక్టర్ సాయి సునీల్ తెలిపారు.


