
మార్కెట్లకు వెలుగుల సందడి
జగదాంబ: దీపావళి పురస్కరించుకుని విశాఖ మహా నగరం పండగ శోభను సంతరించుకుంది. సోమవారం దీపావళి కావడంతో.. ఆదివారం నగరంలోని ప్రధాన మార్కెట్లన్నీ జనసంద్రంగా మారాయి. ముఖ్యంగా పూర్ణా మార్కెట్, జగదాంబ కూడలి, అక్కయ్యపాలెం, కంచరపాలెం, గాజువాక, మధురవాడ, తదితర ప్రాంతాలు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. పండగకు అత్యంత ముఖ్యమైన లక్ష్మీ పూజ కోసం అవసరమైన పూజా సామగ్రి, పూల దండలు, పండ్లు, మట్టి ప్రమిదలు, చెరుకు గడలు, దివ్వెలు వెలిగించేందుకు ఆముదం కర్రలు కొనుగోలు చేసేందుకు ప్రజలు, ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మార్కెట్లలో ఎక్కడ చూసినా పండగకు అవసరమైన వస్తువులతో దుకాణాలు వెలిశాయి. ఈ సందడి దీపావళి వెలుగులతో పాటు కార్తీక మాసం ఆగమనానికి దర్పణం పట్టింది.
అంబరాన్నంటిన ధరలు
పండగను ఆసరాగా చేసుకుని వ్యాపారులు ధరలను అమాంతం పెంచేశారు. ముఖ్యంగా పూల ధరలు ఆకాశాన్నంటాయి. కేవలం 50 గ్రాముల పూలు రూ.150కి పైగా పలకడం గమనార్హం. పండ్ల ధరలు కూడా వినియోగదారులకు షాక్ ఇచ్చాయి. నిన్నమొన్నటి వరకు కిలో రూ.200 ఉన్న యాపిల్ పండ్లు.. నేడు రూ. 350కి చేరాయి. దానిమ్మ పండ్ల ధరల గురించి చెప్పనక్కర్లేదు. చిన్నవి కిలో రూ. 350 ఉండగా, పెద్దవి రూ. 500 వరకు పలికాయి. అరటి పండ్లు కిలో రూ.100, బత్తాయిలు రూ.120కి విక్రయించారు. వీటితో పాటు కొబ్బరికాయలు, అరటి డొప్పలు, తమలపాకుల ధరలు కూడా పెరిగిపోయాయి.
జోరుగా టపాసుల అమ్మకాలు
దీపావళి సంబరాల్లో ముఖ్యమైన బాణసంచా కొనుగోళ్లు జోరుగా సాగాయి. ఏయూ ఇంజినీరింగ్ కాలేజ్ గ్రౌండ్, ఏఎస్ రాజా గ్రౌండ్‌తో పాటు గోపాలపట్నం, మల్కాపురం, సుజాతనగర్, పెందుర్తి, గాజువాక, షీలానగర్, కంచరపాలెం, ఎన్‌ఏడీ కూడలి వంటి ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన స్టాళ్ల వద్ద సందడి నెలకొంది. కొందరు చిరు వ్యాపారులు పూర్ణా మార్కెట్ సమీపంలోని స్ప్రింగ్‌రోడ్డు, వన్‌టౌన్ రహదారి, బ్యారెక్స్ రోడ్డు తదితర ప్రాంతాల్లో బండ్లపై గ్రీన్‌కాకర్స్ విక్రయించారు. ధరల భారం ఉన్నప్పటికీ.. ప్రజలు వెలుగుల పండగను సంతోషంగా జరుపుకునేందుకు ఉత్సాహంగా కొనుగోళ్లు పూర్తి చేశారు.

మార్కెట్లకు వెలుగుల సందడి