
రుషికొండ భవనాలను మ్యూజియంగా ప్రకటించాలి
బీచ్‌రోడ్డు: రుషికొండపై నిర్మించిన భవనాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించకుండా వాటిని రాష్ట్ర మ్యూజియంగా ఏర్పాటు చేయాలని బుద్ధిస్ట్ మాన్యుమెంట్స్ ప్రొటెక్షన్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ప్రైవేటు సంస్థలకు భవనాలను అప్పగించేందుకు ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టడాన్ని వ్యతిరేకిస్తూ.. ఆదివారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద అసోసియేషన్ ప్రతినిధులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రుషికొండ భవనాలపై హైకోర్టులో రిట్ పిటిషన్లు(241/2021, 257/2021), సీసీ నంబర్ 1425/2022 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. భవనాలను నిపుణులతో పరిశీలించి నివేదిక ఇవ్వాలని హైకోర్టు, కేంద్ర పర్యావరణ శాఖను ఆదేశించినా, ఆ నివేదిక ఇంకా కోర్టుకు అందలేదని తెలిపారు. అనేక కేసులు పెండింగ్‌లో ఉండగా.. హైకోర్టు తుది తీర్పు కోసం ఆగకుండా, ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో ప్రభుత్వం చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడటం సరికాదని వారు మండిపడ్డారు. విశాఖపట్నం చారిత్రక, సాంస్కృతిక ప్రాధాన్యత కలిగిన ప్రాంతమని.. బౌద్ధ, జైన అవశేషాలు ఇక్కడ విరివిగా ఉన్నాయని గుర్తు చేశారు. తెలుగుజాతి ఔన్నత్యం, భావితరాలకు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు ఈ మ్యూజియం ఎంతో అవసరమని తెలిపారు. మ్యూజియం ఏర్పాటు చేయడం ద్వారా జపాన్, చైనా, థాయిలాండ్ వంటి బౌద్ధ దేశాల నుంచి పర్యాటకులు వస్తారని.. విదేశీ మారక ద్రవ్యం లభిస్తుందని, కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు కూడా రాబట్టుకోవచ్చని సూచించారు. పెండింగ్ కేసుల నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే ప్రజాభిప్రాయ సేకరణ ప్రక్రియను నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ
బుద్ధిస్టుల నిరసన