
24 గంటల మంచినీటి సరఫరా పనులు సత్వరం పూర్తి
డాబాగార్డెన్స్: నగరంలో జరుగుతున్న 24 గంటల మంచినీటి సరఫరా ప్రాజెక్టు పనులను వేగవంతం చేసి ప్రజలకు నీటి సరఫరా ప్రారంభించాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, మంచినీటి విభాగం పర్యవేక్షక ఇంజినీర్ కేవీఎన్ రవిని ఆదేశించారు. శుక్రవారం ఆయన మాధవధారలోని విశాఖపట్నం నార్త్–వెస్ట్ సెక్టార్‌లోని ప్రాజెక్టు పనులను పరిశీలించారు. ఈ ప్రాజెక్టు ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ నిధులతో అమలవుతోంది. ఆయన మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టు పనులను కాంట్రాక్టర్ నాగార్జున కన్‌స్ట్రక్షన్ కంపెనీ తక్షణమే పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ ఏడాది డిసెంబర్ 31 నాటికి పనులు పూర్తి కావాలని స్పష్టం చేశారు. ఇప్పటికే ప్రాజెక్టు పరిధిలోని మాధవధార, మురళీనగర్, మర్రిపాలెం ప్రాంతాల్లో 24 గంటల నీటి సరఫరా ప్రారంభమైందని కమిషనర్ తెలిపారు. ఈ ప్రాంతాల్లో ఇప్పటివరకు 5,000 మంచినీటి కనెక్షన్లు అందించామని, నీటి వినియోగానికి అనుగుణంగా బిల్లులు సిద్ధం చేయాలని సూచించారు. బిల్లులను ఈఆర్‌పీ మాడ్యూల్‌లో నమోదు చేసేందుకు అవసరమైన సాంకేతిక ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. వినియోగదారుల అవగాహన కోసం ముందుగా నమూనా బిల్లులు జారీ చేయాలని చెప్పారు. కార్యక్రమంలో ఈఈలు ఏడుకొండలు, మురళీకృష్ణ, ఉప కార్యనిర్వాహక ఇంజినీర్ సతీష్,ఏఈలు రాజ్‌కుమార్, సుమన్, ఎన్‌సీసీ డీజీఎం రంగారావు పాల్గొన్నారు.