
12 జిల్లాలతో ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం
ఆర్‌ఆర్‌ఎస్ అధ్యక్షుడు వెంకటసుబ్బారెడ్డి డిమాండ్
ఎంవీపీ కాలనీ: కేంద్ర ప్రభుత్వం 2029 నాటికి ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం ఏర్పాటు చేయాలని రాయలసీమ రాష్ట్ర సమితి(ఆర్‌ఆర్‌ఎస్) అధ్యక్షుడు డాక్టర్ కుంచం వెంకటసుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. విశాఖ పర్యటనలో ఉన్న ఆయన శుక్రవారం నగరంలోని ఓ హోటల్లో విలేకరులతో మాట్లాడారు. రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగా లేదా కేంద్ర పాలితప్రాంతంగా ప్రకటించాలన్నారు. 1953లో రాష్ట్రం విడిపోయినప్పుటు కర్నూల్‌ను రాజధానిగా ఏర్పాటు చేశారని, అనంతరం హైదరాబాద్‌కు రాజధానిని మార్చిన విషయాన్ని గుర్తు చేశారు. 1937 శ్రీభాగ్ ఒప్పందంతో రాయలసీమకు అన్యాయం జరిగిందన్నారు. ఈ ఒప్పందం జరిగి ఎనిమిది దశాబ్థాలవుతున్నా ఒప్పందంలోని ఒక్క అంశం కూడా నెరవేరలేదన్నారు. ఈ నేపథ్యంలో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3ని సవరించి 12 జిల్లాలతో కూడిన రాయలసీమ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు పార్లమెంట్‌లో చర్చించి నిర్ణయం తీసుకోవాలని కోరుతూ ప్రధాని మోదీకి ఇటీవల లేఖ రాసినట్లు పేర్కొన్నారు. రాయలసీమ, కోస్తా జిల్లాలకు సమాన సంఖ్యలో శాసనసభ స్థానాల కేటాయింపు, నీటి వనరుల పంపిణీపైనా దృష్టిసారించాలని ఆ లేఖలో పేర్కొన్నట్లు వెల్లడించారు.