
స్థల వివాదంలో కొట్లాట.. ఐదుగురికి గాయాలు
కూర్మన్నపాలెం: స్థల వివాదం కొట్లాటకు దారి తీయడంతో ఐదుగురు గాయపడ్డారు. దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు అందించిన వివరాలు.. పెదగంట్యాడ మండలం అప్పికొండలో రౌడీషీటర్ గరికిన గంగరాజు, ఆయన సోదరి చోడిపల్లి బంగారమ్మల మధ్య చాలా రోజుల నుంచి భూవివాదం ఉంది. దీనిపై ఇరువర్గాల వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ వివాదం నడుస్తుండగానే గంగరాజు సదరు స్థలాన్ని చదును చేసేందుకు పనులు ప్రారంభించాడు. విషయం తెలుసుకున్న బంగారమ్మ.. భర్త వెంకటరావుతో కలిసి అక్కడికి వెళ్లి పనులను అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. ఈలోగా గంగరాజు భార్య, కుమారుడు అక్కడకు చేరుకున్నారు. ఒకరిపై ఒకరు రాళ్లు, కర్రలతో దాడి చేసుకున్నారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడకు చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. ఈ ఘర్షణలో గంగరాజు తలకు తీవ్ర గాయాలు కావడంతో కుట్లు పడ్డాయి. గంగరాజు సోదరి బంగారమ్మకు కూడా తీవ్రగాయాలైనట్లు పోలీసులు తెలిపారు. వారిద్దరితోపాటు గంగరాజు భార్య, కొడుకు కోటేశ్వరరావు, బావ వెంకటరావు కూడా గాయపడ్డారు. గంగరాజు కుటుంబసభ్యులు అగనంపూడి ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, ఆయన సోదరి, బావ కిమ్స్ ఐకాన్ ఆస్పపత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం లేదన్నారు. ఇరు వర్గాలపై కేసు నమోదుచేసి, నిందితులు గంగరాజుతోపాటు భార్య బంగారమ్మ, కొడుకు కోటేశ్వరరావు, కూతురు భానులను రిమాండ్‌కు తరలించినట్లు సీఐ కె.మల్లేశ్వరరావు తెలిపారు.