
సింహాచలం రైల్వే స్టేషన్‌లో ప్రీపెయిడ్ ఆటో ట్యాక్సీ స్ట
గోపాలపట్నం: ప్రయాణికుల భద్రత కోసం ప్రీపెయిడ్ ఆటో ట్యాక్సీ స్టాండ్‌ను ప్రారంభిస్తున్నట్లు రైల్వే డీఆర్‌ఎం లలిత్ బోహ్రా, నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి తెలిపారు. సింహాచలం రైల్వే స్టేషన్ ప్రాంగణంలో ప్రిపెయిడ్ ఆటో ట్యాక్సీ స్టాండ్‌ను బుధవారం ప్రారంభించి, మాట్లాడారు. ఇక్కడి రైల్వే స్టేషన్‌లో 22 రైళ్లు ఆగుతున్నాయని, వాటిలో దిగే ప్రయాణికులు నగరంలోని పలు ప్రాంతాలకు వెళ్లేటపుడు భద్రత పరంగా భయపడనక్కర్లేకుండా ఈ ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ఆటో ధరలు ఉంటాయన్నారు. డీఆర్‌ఎం మాట్లాడుతూ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు పూర్తయితే ప్రయాణికుల సంఖ్య మరింత పెరుగుతుందన్నారు. ఇక్కడ ఈ స్టాండ్ ఏర్పాటుకు సహకరించిన దాతలకు గోపాలపట్నం సీఐ ఎన్‌వీ ప్రభాకర్ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ప్రయాణికులకు టోకెన్ అందించి ఆటోలో ఎక్కించి, జెండా ఊపి ఆటో ట్యాక్సీ సేవల్ని ప్రారంభించారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ మేరీ ప్రశాంతి, ఏడీసీపీ ప్రవీణ్‌కుమార్, ఏసీపీ ఏబీ పృథ్వీతేజ, ట్రాఫిక్ సీఐలు సురేష్‌కుమార్, దాశరథి, ఎస్‌ఐలు, తదితరులు పాల్గొన్నారు.