
● కీలక కేసుల్లో ప్రధాన నిందితుల అరెస్టులో జాప్యం ● క్రి
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం:
నగరంలో ట్రాఫిక్ నియంత్రించేందుకు అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను ఉపయోగిస్తున్నాం!
డ్రోన్లను ఎగురవేసి నగరంలో అసాంఘిక కార్యకలాపాల కట్టడికి ప్రయత్నిస్తున్నాం!!
ఇవీ ఉదయం లేచినప్పటి నుంచి విశాఖ నగర పోలీసులు పలుకుతున్న సాంకేతిక బీరాలు. అయితే, కీలక కేసుల్లో మాత్రం అసలు సూత్రధారులు దర్జాగా తప్పించుకు తిరుగుతున్నారు. ఏకంగా బెయిల్ వచ్చే వరకూ అరెస్టు చేయకుండా విశాఖ పోలీసులు తాత్సారం చేస్తున్నారనే విమర్శలున్నాయి. ఇక తిమ్మాపురం వద్ద వివాదాస్పద భూమిలో అర్ధరాత్రి ముసుగులు వేసుకుని నంబరు ప్లేట్లు లేని వాహనాల్లో హల్‌చల్ చేసి ఉన్న రూంను నేలమట్టం చేసిన వ్యవహారంలో అసలు దోషులెవరో ఇప్పటికీ విశాఖ పోలీసులు ముసుగుతీయకపోవడం గమనార్హం. ఇక శాంతి ఆశ్రమం వద్ద జరిగిన దాడి వ్యవహారంలో అసలు దోషుల దరిదాపుల్లోకి కూడా విశాఖ పోలీసులు వెళ్లేందుకు కూటమి నేతల సంకెళ్లు అడ్డుపడుతున్నాయనే విమర్శలున్నాయి. ఇక 25 గ్రాముల కొకై న్ కేసులోనూ కీలక సూత్రధారులైన వారి నిగ్గు తేల్చకపోవడం విశాఖ పోలీసు శాఖ తీరును ప్రశ్నిస్తున్నాయి.
కీలక కేసులన్నింటిలోనూ అదే తీరు!
వాస్తవానికి విశాఖ నగరంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రోజురోజుకూ భూదందాలు, బెట్టింగ్‌లు, గంజాయి అమ్మకాలు, రౌడీషీటర్ల హత్యలు, అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. మహిళలపై అఘాయిత్యాలకు అంతులేకుండా పోతోంది. అయినప్పటికీ సంఘటన జరిగిన సమయంలో హడావుడి తప్ప, అసలు వ్యవహారం వచ్చేసరికి పోలీసులు కీలక నిందితుల జోలికి వెళ్లడం లేదనే విమర్శలు బలంగా ఉన్నాయి. క్రికెట్ బెట్టింగ్ వ్యవహారం మొదలుకొని, రామానాయుడు స్టూడియో వద్ద ముసుగు వీరుల విధ్వంసం, శాంతి ఆశ్రమంలో రౌడీషీటర్ల హల్‌చల్ వంటి అనేక కీలక కేసులలో పోలీసులు కీలక సమయాల్లో వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధాన నిందితులు బెయిల్ వచ్చే వరకు దొరకకుండా తప్పించుకోవడం అసలైన కిటుకు. ఈ వ్యవహారాలలో కూటమి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేల అండదండలతో పోలీసులు కూడా అసలైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పట్టుకోవడం లేదని తెలుస్తోంది.
శాంతి ఆశ్రమంలో
ఇంకా అశాంతే...!
శాంతి ఆశ్రమాన్ని ఆక్రమించి, సొంతంగా వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకుని టీడీపీ ఎమ్మెల్యే అండదండలతో కొన్నేళ్లుగా సిద్ధార్థ, గౌతం అనే వ్యక్తులు అధికారం చెలాయిస్తున్నారు. దీనిపై కోర్టులో కేసులు నడిచి, చివరకు ఆశ్రమానికి స్థలాన్ని అప్పగించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలు రావడంతో రౌడీలు రంగంలోకి దిగారు. ఈ వ్యవహారంలో కేవలం అక్కడికి వెళ్లి గొడవకు దిగిన రౌడీషీటర్లను మాత్రమే పోలీసులు అరెస్టు చేశారు. అయితే, అసలు మొత్తం వ్యవహారాన్ని నడిపిన, శాంతి ఆశ్రమం స్థలాన్ని కబ్జా చేసి తమ ఆధీనంలో ఉంచుకున్న అసలు నిందితులకు టీడీపీ ఎమ్మెల్యే బలంగా మద్దతు ఇస్తుండటంతో వారిని అరెస్టు చేయలేదనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. బెయిల్ వచ్చే వరకు జోలికి వెళ్లలేదనే విమర్శలున్నాయి. దీనితో పాటు శాంతి ఆశ్రమం స్థలంలో నడుస్తున్న పెట్రోల్ బంకు నుంచి పోలీసు జీపులకు ఉచితంగా ప్రతీ నెలా పెట్రోల్ నింపుతుండటం మరో కారణమనే విమర్శలూ ఉన్నాయి.
బెట్టింగ్‌లోనూ
బెయిల్ వచ్చే దాకా...!
క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారనే సమాచారంతో జనవరి 6వ తేదీన ఇసుకతోట, శివాజీ పాలెం, పెద్దవాల్తేరులోని గాయత్రీ టవర్స్‌లో టాస్క్‌ఫోర్స్ పోలీసులు లగుడు రవిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, సదరు లగుడు రవితో పాటు మరో ఇద్దరు కూటమి ఎమ్మెల్యే అనుచరులు కూడా బెట్టింగ్‌లో ఉన్నట్టు తేలింది. వీరితో పాటు ఈ వ్యవహారాన్ని నడిపిస్తూ, నెలవారీ మామూళ్లను కూటమి ఎమ్మెల్యేకు చేరవేయడంలో కీలకంగా ఉన్న ఒక స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్ పాత్ర కూడా ఉంది. అయితే, సదరు కానిస్టేబుల్ జోలికి వెళ్లకుండా ఏకంగా ఇద్దరు కూటమి ఎమ్మెల్యేలు రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. నెలవారీగా భారీగా మామూళ్లు దండుకుంటున్న ఓ కూటమి ఎమ్మెల్యే అనుచరులే లక్షల్లో బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారు. వీరి ముఠా విశాఖ నుంచి కాకినాడ మీదుగా హైదరాబాద్ వరకు పాకినట్టు తెలుస్తోంది. ఈ ముఠా జోలికి వెళ్లకుండా ఉండాలని ఏకంగా పోలీసులకే ఫోన్లు చేసినట్టు ఆరోపణలున్నాయి. అంతేకాకుండా, ఈ బెట్టింగ్‌లో ఉన్న కూటమి ఎమ్మెల్యే అనుచరుడు బొబ్బిలి రవికి బెయిల్ వచ్చే వరకు విశాఖ పోలీసులు అరెస్టు చేయలేదంటే, పోలీసులపై ఏ స్థాయిలో ఒత్తిళ్లు పనిచేస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు.
డ్రగ్స్ కేసులో దొరకని దొంగలు
ఢిల్లీ నుంచి విమానంలో దక్షిణాఫ్రికాకు చెందిన థామస్ అనే వ్యక్తి డ్రగ్స్ తీసుకొస్తున్నాడని నగర పోలీసులకు సెంట్రల్ ఏజెన్సీల నుంచి సమాచారం అందింది. సదరు వ్యక్తి కస్టమ్స్‌కు చిక్కకుండా 25 గ్రాముల కొకై న్‌ను పుస్తకాల మధ్యలో పెట్టి తీసుకొచ్చాడు. ఎయిర్‌పోర్టు నుంచి సదరు విదేశీయుడిని అనుసరించి, ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ దగ్గరికి వచ్చిన తర్వాత రంగంలోకి దిగారు. అక్కడ అక్షయ్‌కుమార్ అలియాస్ మున్నా విదేశీయుడిని కలిసేందుకు వచ్చి డ్రగ్స్ ఇస్తుండగా, పోలీసులు వారిని వలపన్ని పట్టుకున్నారు. దక్షిణాఫ్రికాకు చెందిన వ్యక్తి ఫోన్‌తో పాటు మున్నా ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. మున్నాను విచారించి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఒకరు వైద్యుడు కాగా, మరొకరు కూటమి నాయకుడి కుమారుడు, మరొకరు ఉత్తరాంధ్ర కూటమి నేతల ఆర్థిక లావాదేవీలు చూసే బడా నేత కుమారుడని తెలుస్తోంది.
ఈ ముగ్గురిని పట్టుకోగానే కూటమికి చెందిన ఎమ్మెల్యే, ఎంపీలు నేరుగా పోలీసులకు ఫోన్ చేసి ముగ్గురిని విడిచిపెట్టాలని ఒత్తిళ్లు చేశారనే ఆరోపణలున్నాయి. పోలీసులపై తీవ్ర ఒత్తిడి రావడంతో కేవలం ఇద్దరిని మాత్రమే అరెస్ట్ చేశామంటూ తొలిరోజు ప్రెస్ మీట్‌లో సీపీ వెల్లడించారు. మొత్తం ఐదుగురిని అదుపులోకి తీసుకొని ఇద్దరిని మాత్రమే ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని మీడియా ప్రశ్నించగా, మిగిలిన ముగ్గురు అనుమానితులు మాత్రమేనని, నిందితులు కాదని సమాధానమిచ్చారు. అదేవిధంగా ఢిల్లీకి వెళ్లిన విచారణ బృందం కూడా కింగ్ పిన్ ప్రిన్స్‌ను పట్టుకోలేకపోయారనే విమర్శలున్నాయి. ఇక విశాఖలోని రెండు పబ్‌లలో వ్యవహారం నడుస్తుందని తెలిసినప్పటికీ, వాటిపై కూడా లోతైన విచారణ జరగకుండా ఎవరో అడ్డుపడుతున్నారనే ఆరోపణలున్నాయి.
భూకబ్జాలో తొలగని ముసుగులు
విశాఖ నగరంలో బీచ్‌కు ఆనుకుని రామానాయుడు స్టూడియోకు సమీపంలోని ప్రైవేటు స్థలంలో 20 మంది దుండగులు ముఖానికి ముసుగులు ధరించి, అక్కడున్న సీసీ కెమెరాలను ధ్వంసం చేసి, కరెంటు వైర్లు కత్తిరించారు. నంబర్ ప్లేట్‌లపై తెల్లకాగితం అంటించిన వాహనాలలో 20 మంది వచ్చి చిన్నపాటి దమనకాండ సృష్టించారు. రాత్రికి రాత్రే గెస్ట్ హౌస్, కాంపౌండ్ వాల్‌ను కూల్చివేసి, డెబ్రిస్‌ను కూడా లారీలల్లో మే 8వ తేదీన తరలించారు. ఈ వ్యవహారంలో టీడీపీ ఎమ్మెల్యే హస్తం ఉందనే ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంలో ఇప్పటివరకు ముసుగు ధరించిన అసలు దొంగలను మాత్రం పోలీసులు గుర్తించలేకపోయారు. అసలు విచారణ జరగకుండా సదరు టీడీపీ ఎమ్మెల్యేనే అడ్డుకున్నారనే ఆరోపణలూ ఉన్నాయి. ఇంత యథేచ్ఛగా భూకబ్జాలకు పాల్పడుతున్నప్పటికీ పోలీసులు మాత్రం మిన్నకుండిపోవడంలో అసలు ఆంతర్యం కూటమి నేతల ఒత్తిడేనని స్పష్టమవుతోంది.