
దేవుడి పేరిట దోపిడీ
● అయోధ్య మందిరం సెట్ పేరుతో మోసం ● సిబ్బందికి బిల్లులు ఎగ్గొట్టడంతో వాయిస్ రికార్డులతో వెలుగులోకి వాస్తవాలు
ఏయూక్యాంపస్: హిందువుల ఆధ్యాత్మికతను, ట్రెండింగ్‌లో ఉన్న అయోధ్య రాముడిని ఆధారంగా చేసుకొని బీచ్ రోడ్డులో ఏర్పాటు చేసిన గరుడ అయోధ్య రామాలయం నమూనా నిర్వాహకులు భారీ మోసానికి పాల్పడినట్లు వెల్లడైంది. దేవుడి పేరుతో వ్యాపారం చేస్తూ, ఆలయాలను, దేవుడిని వ్యాపార వస్తువులుగా మార్చుకున్నారని ఆరోపణలు వస్తున్నాయి. రెండు నెలలపాటు ఈ వ్యాపారం ద్వారా కోట్లాది రూపాయలు సంపాదించిన వీరు, ఆశతో రామకల్యాణం పేరుతో ప్రజల నుంచి భారీగా డబ్బులు వసూలు చేయాలని ప్రణాళిక రచించారు. సింహాచలం గిరి ప్రదక్షిణను సైతం తమ ప్రచారానికి వాడుకున్నారు.
సోషల్ మీడియాలో లీకై న వాయిస్ రికార్డులు
లక్షలాది మంది ప్రజలు పొరుగు జిల్లాల నుంచి గిరి ప్రదక్షిణకు వస్తారని గుర్తించిన నిర్వాహకులు.. దాదాపు 250 ఫ్లెక్సీలు, 5 వేల పోస్టర్లతో రామకల్యాణంపై విస్తృత ప్రచారం చేశారు. అయితే తమ ప్రచారానికి ఉపయోగపడిన సోషల్ మీడియానే తమ తప్పులను సైతం బయటపెడుతుందని నిర్వాహకులు ఊహించలేదు. ఆలయం వద్ద సిబ్బందికి, నిర్వాహకుడికి మధ్య జరిగిన సంభాషణలు తాజాగా బయటకు రావడంతో వారి పన్నాగం బట్టబయలైంది. తన వద్ద పనిచేస్తున్న సిబ్బందికి, సేవలు అందించిన వారికి బిల్లులు ఇవ్వకుండా నిర్వాహకులు ఎగ్గొట్టారు. దీంతో నిర్వాహకుడికి, వ్యాపారస్తుడికి మధ్య జరిగిన సంభాషణ వెలుగులోకి వచ్చింది. ఈ సంభాషణలో స్వయంగా పోస్టర్లు తామే ముద్రించి ప్రచారం చేశామని నిర్వాహకుడు అంగీకరించాడు. నగరవ్యాప్తంగా 250 ఫ్లెక్సీలు, 5 వేల పోస్టర్లు అతికించామని నిర్వాహకుడు చెప్పడం విశేషం. నగరంలోని రామాలయాల వద్ద కూడా ప్రచారం చేయాలని, రామభక్తులను తమ గుడికి ఆహ్వానించాలని వీరు మాట్లాడుకున్నారు. ఒక్కొక్కరి నుంచి రూ. 2,999 కల్యాణం రుసుము రూపంలో వసూలు చేసి, వేలాది మందితో దీనిని నిర్వహించి లక్షలాది రూపాయలు ఒక్క రోజులో సంపాదించాలని పక్కాగా ప్లాన్ చేశారు.
నిస్సిగ్గుగా అబద్ధాలు, వెలుగులోకి వాస్తవాలు
భద్రాచలం దేవస్థానం ఈవో విశాఖ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిర్వాహకులు తమ తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. వెంటనే ఒక హోటల్‌లో విలేకరుల సమావేశం పెట్టి పోస్టర్లు తాము ముద్రించలేదని, ఎవరో గిట్టని వారు చేసిన పని అని చెప్పారు. దీనిపై తాము పోలీసులను ఆశ్రయిస్తామన్నారు. సాధు పరిషత్ సభ్యులు సైతం ఆలయాన్ని సందర్శించినప్పుడు నిర్వాహకులు, వారి అనునాయులు పోస్టర్లు తాము ముద్రించలేదని చెప్పారు. అయితే తాజాగా బయటపడిన వాయిస్ రికార్డులను బట్టి నిర్వాహకుడే ఉద్దేశపూర్వకంగా భక్తి పేరుతో వ్యాపారం చేసినట్లు స్పష్టమవుతోంది. జూలై 9న జరిగిన గిరి ప్రదక్షిణలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, పోస్టర్లు తమవి కావని చెబుతున్న నిర్వాహకులు వెంటనే పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అలాగే పోస్టర్లలో ముద్రించిన ఫోన్ నంబర్లు ఎవరివి, ఆ నంబర్లు ఎవరి పేరుమీదుగా రిజిస్టర్ అయ్యాయనే దిశగా విచారణ జరిపితే మరిన్ని వాస్తవాలు బయటపడే అవకాశం ఉంది.
అధికారుల ఉదాసీనతపై విమర్శలు
గరుడ అయోధ్య రామమందిరం నమూనా ఏర్పాటు జరిగిన నాటి నుంచి వివిధ విభాగాల అధికారుల ఉదాసీనత బయటపడుతోంది. జీవీఎంసీ, ఫైర్ సేఫ్టీ, దేవదాయ శాఖ, పోలీసులు, జీఎస్‌టీ అధికారులు ఈ విషయంపై దృష్టి సారించారా లేదా అనే విషయాలు వెలుగులోకి రావాల్సి ఉంది. నిర్వాహకులు తాత్కాలిక జీఎస్టీ నంబరు తీసుకున్నారా, టికెట్లకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు ఎంతవరకు చూపించారు, నగదు రూపంలో అమ్మిన టికెట్లను లెక్కల్లో చూపించారా, జీఎస్టీ ఎంతవరకు చెల్లించారు అనే విషయాలపై పూర్తిస్థాయిలో విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

దేవుడి పేరిట దోపిడీ