
డిసెంబర్ 26 నుంచి విశాఖ ఉత్సవ్
మహారాణిపేట: పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జరగనున్న ట్రావెల్ మార్ట్ (సెప్టెంబర్ 17–19), భీమిలి ఉత్సవ్ (నవంబర్ 30), విశాఖ ఉత్సవ్ (డిసెంబర్ 26–28), ఉగాది ఉత్సవాలను (మార్చి 19, 2026) ప్రజల్లోకి తీసుకెళ్లాలని కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లను కోరారు. శుక్రవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అక్టోబర్ నుంచి పర్యాటకుల రాక పెరుగుతుందని, కాబట్టి ఇప్పటి నుంచే జిల్లాలోని పర్యాటక, సాంస్కృతిక ప్రాంతాలను హైలైట్ చేయాలని సూచించారు. విశాఖ పర్యాటకాన్ని డిజిటల్ మీడియా ద్వారా దేశ విదేశాలకు ప్రచారం చేయాలని కలెక్టర్ కోరారు. పర్యాటకులను ఆకర్షించడంలో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు క్రియాశీలకంగా పనిచేయాలని, ఇతర రాష్ట్రాలు, దేశాల ప్రజలు విశాఖ గురించి తెలుసుకుని వచ్చేలా చూడాలన్నారు. పర్యాటకంతో పాటు ప్రభుత్వం చేపడుతున్న పీ4 వంటి కార్యక్రమాలు ప్రజలకు అందే ప్రయోజనాలను కూడా తెలియజేయాలని సూచించారు. హెరిటేజ్ స్థలాలు, దేవాలయాలు, సాహస ప్రదేశాలు, ఇప్పటివరకు వెలుగులోకి రాని ప్రాంతాలపై రాబోయే 3–4 వారాల్లో ఫోటో, వీడియో పోటీలు నిర్వహించి నగదు బహుమతులు అందిస్తామని కలెక్టర్ ప్రకటించారు. విశాఖ పర్యాటక ప్రాంతాల సమగ్ర సమాచారం అందించే ‘డిస్కవర్ వైజాగ్’ వెబ్ పేజీని కూడా అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా టూరిజం అధికారి మాధవి, హోటల్స్ యాజమాన్యం తరఫున పవన్ కార్తీక్, ఈవెంట్ మేనేజర్ వీరు మామ, పలువురు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ పోస్టర్‌ను విడుదల చేశారు.