
అంతా యాపారమే..
ఆధ్యాత్మికత ముసుగులో వసూళ్లు ● ప్రవేశాల నుంచి చెప్పులు స్టాండ్ వరకు రుసుములే.. ● దుకాణాల అద్దెలతో వ్యాపారం ● హోర్డింగ్ కోసం రూ.లక్షల చెల్లించాల్సిందే.. ● బీచ్ రోడ్‌లోని రామాలయం సెట్‌పై విమర్శలు వెల్లువ ● తాజాగా కల్యాణం పేరుతో రూ.2,999 వసూలు
అయోధ్య
మందిరం సెట్
ఏయూక్యాంపస్ : దేవుడిని దర్శించుకోవాలంటే టికెట్ కొనాలి. చెప్పులు పెట్టడానికి టికెట్ కొనాలి. దాహం వేసి మంచినీళ్ల కావాలంటే అక్కటే పెట్టిన దుకాణాలలో కొనుగోలు చేయాలి. ఇలా అడుగడుగునా ఆధ్యాత్మికత పేరుతో ప్రజలను దోచుకుంటున్నారు. బీచ్‌రోడ్డులో ఏర్పాటు చేసిన గరుడ అయోధ్య రామ మందిరం నమూన చుట్టూ ఆర్థిక లావాదేవీలే కనిపిస్తున్నాయి. గత రెండు నెలలుగా బీచ్‌రోడ్డులో నిర్వహిస్తున్న ఈ ఆధ్యాత్మిక వ్యాపారం వెనుక ఉన్న అనేక అంశాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి.
దేవుడి పేరుతో దండుకొంటున్నారు
దేవుడి పేరు చెప్పి గత రెండు నెలలుగా కోట్లాది రూపాయలు దండుకున్నారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఇక్కడి పరిస్థితులు సైతం దీనికి అద్దం పడుతున్నాయి. అయోధ్య రామ మందిరం నమూనాను రెండు నెలల క్రితం బీచ్‌రోడ్డులోని ఒక ప్రైవేటు విల్లాకు సంబంధించిన స్థలంలో నిర్మించారు. ప్రవేశ రుసుముగా రూ.50, చెప్పులు భద్రపరచడానికి రూ.5 చొప్పున వసూలు చేస్తున్నారు. సాధారణ రోజుల్లో వెయ్యి నుంచి నాలుగు వేల మంది, శని, ఆది వారాలలో 5 నుంచి 10 వేల మంది దీనిని దర్శించుకుంటున్నారని తెలుస్తోంది. దీంతో గత రెండు నెలల కాలంలో నిర్వాహకులు భారీగానే సంపాదించారని స్థానికులు చెబుతున్నారు. వీరు పెట్టిన పెట్టుబడికి రెట్టింపు లాభాలను పొందారనే విషయం స్పష్టం అవుతోంది. అదే విధంగా ఇక్కడ సందర్శకులకు కనీసం మంచి నీళ్లు కూడా ఇవ్వడం లేదు. అక్కడే ఏర్పాటు చేసిన దుకాణాల్లో కొనుక్కోవాల్సిందే.
రాముని కల్యాణంతో బయటకు పొక్కింది
ఆయోధ్య రాముని కల్యాణోత్సవాలు పేరుతో గత కొన్ని రోజులుగా నగరంలో పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. ఈ నెల 29న నిర్వహించే కల్యాణంలో భద్రాచలం ఆస్థాన పండితులు పాల్గొంటారని పేర్కొన్నారు. రూ.2,999 ధర గల కల్యాణం టికెట్ల కోసం తమను సంప్రదించాలని కోరుతూ ఫోన్ నంబర్లను సైతం ప్రకటించారు. రాముని కల్యాణాన్ని సైతం ఒక వ్యాపార కార్యక్రమంగా మార్చేశారు. దీనిపై భద్రాచలం ఆలయ అధికారులు విశాఖ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇక్కడ అనధికారికంగా జరుగుతున్న తంతు బయటకు వచ్చింది. నిర్వాహకులు మాత్రం తాము భద్రాచలం ఆస్థాన పండితులు వస్తారని చెప్పలేదని, భద్రాచలం నుంచి పండితులు వస్తారని మాత్రమే చెప్పామని వివరణ ఇచ్చేసి చేతులు దులిపేసుకున్నారు.
బాధితులు బయటకు వస్తున్నారు
అయోధ్య రామ మందిరం సెట్ వేసిన నిర్వాహకుడు దుర్గాప్రసాద్ చేతిలో నష్టపోయిన కాకినాడకు చెందిన దుర్గ గణేష్ తాజాగా ఒక వీడియో విడుదల చేశాడు. అయోధ్య రామ మందిరం సెట్ పేరుతో రూ.32 లక్షలు ఖర్చుచేయించి, డబ్బులు తిరిగి ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్నాడని ఆరోపించారు. కూరగాయల వ్యాపారం చేసే తనను నమ్మించి కుంభమేళాలో రామ మందిరం సెట్ వేస్తున్నానని, దానిలో పెట్టుబడిగా రూ.30 లక్షలు ఇస్తే రూ.50 లక్షలు ఇస్తానని నమ్మించి మోసం చేశాడని వీడియోలో ఆరోపించాడు. ఇప్పటికే తాను కాకినాడ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు కూడా చేసినట్లు తెలిపాడు.

అంతా యాపారమే..