
సైనిక ఉద్యోగులకు విభిన్న కోర్సులందిస్తాం
మద్దిలపాలెం: ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని మంగళవారం వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఎన్.ఎస్.రాజా సుబ్రమణి సందర్శించారు. ఆయనకు ఏయూ రిజిస్ట్రార్ ఆచార్య ఇ.ఎన్.ధనంజయరావు స్వాగతం పలికారు. అనంతరం ఏయూ ఉపకులపతి ఆచార్య జి.పి.రాజశేఖర్‌తో కార్యాలయంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు పలు కీలక అంశాలపై చర్చించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను వీసీ ఆయనకు వివరించారు. త్రివిధ దళాల ఉద్యోగులకు ఏయూ ఎల్లవేళలా సేవలందించడానికి సిద్ధంగా ఉందన్నారు. విశ్వవిద్యాలయంలోని మాన వ వనరులను సైనిక ఉద్యోగుల అభివృద్ధికి, వారిలో విభిన్న నైపుణ్యాలను పెంపొందించడానికి వినియోగిస్తామని తెలిపారు. ‘సెంటర్ ఫర్ డిఫెన్స్ స్టడీస్’ద్వారా త్రివిధ దళాలకు ఉన్న అనుబంధాన్ని మరింత బలోపేతం చేస్తామని, త్రివిధ దళాల్లో పనిచేస్తున్న సైనిక ఉద్యోగులకు అవసరమైన విభిన్న కోర్సులను అందిస్తామని వీసీ స్పష్టం చేశారు.